పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 60 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. 242 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్ 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కే ఆలౌటైంది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ 3 వికెట్లు తీయ‌గా.. ఫెర్గ్యూస‌న్‌, స్వ‌ప్నిల్ సింగ్‌, క‌ర్ణ్ శ‌ర్మ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. రజత్ పటీదార్ బెంగళూరు జట్టుకు ఊపు తెచ్చాడు. కేవ‌లం 23 బంతులు ఎదుర్కొన్న పటీదార్‌ 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు సాధించాడు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ ల సాయంతో 18 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2, అర్షదీప్ సింగ్, కెప్టెన్ శామ్ కరన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

242 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ‌రిలోకి దిగిన‌ పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 16 బంతుల్లో 27 ప‌రుగులు చేసిన బెయిర్ స్టో ఫెర్గ్యూస‌న్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు. శ‌శాంక్ సింగ్ 19 బంతుల్లో 4 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేసి ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. అనంత‌రం జితేశ్ శ‌ర్మ (5), లివింగ్ స్టోన్(0), శామ్ క‌ర‌న్‌(22) వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో పంజాబ్ ప‌రాజ‌యం ఖాయ‌మైంది. పంజాబ్ 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ నాకౌట్ రేసు నుంచి అధికారికంగా నిష్క్ర‌మించింది.

Updated On 9 May 2024 8:20 PM GMT
Yagnik

Yagnik

Next Story