SRHvsPBKS: థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచిన సన్ రైజర్స్
ఐపీఎల్ లో భాగంగా ముల్లన్ పూర్ లో సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ లో భాగంగా ముల్లన్ పూర్ లో సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు పరుగుల తేడాతో గెలిచి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. 183 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉనద్కట్ ఓ వైడ్ బాల్ వేసి.. సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ రావడంతో, చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ సిక్స్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ మ్యాచ్ లో శశాంక్ సింగ్ 25 బంతుల్లో 46 పరుగులు చేసి, దాదాపు పంజాబ్ ను గెలిపించినంత పనిచేశాడు. అశుతోష్ శర్మ 15 బంతుల్లో 33 పరుగులు చేసి సన్ రైజర్స్ కు టెన్షన్ పెట్టించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19, శామ్ కరన్ 29, సికిందర్ రజా 28 పరుగులు చేశారు. అంతకుముందు, కెప్టెన్ శిఖర్ ధావన్ (14), జానీ బెయిర్ స్టో (0), ప్రభ్ సిమ్రన్ సింగ్ (4) విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కమిన్స్ 1, నటరాజన్ 1, నితీశ్ రెడ్డి 1, ఉనద్కట్ 1 వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16), మార్ క్రమ్ (0) అవుట్ అవ్వడంతో హైదరాబాద్ కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. అయితే నితీష్ రెడ్డి హైదరాబాద్ జట్టును ఆదుకున్నాడు. సమద్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. పంజాబ్ లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. అర్షదీప్ 4, శామ్ కరన్ 2, హర్షల్ పటేల్ 2, రబాడా 1 వికెట్ తీశారు.