టీమిండియా, యుఎస్ఏ జట్ల మీద ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది. సూపర్-8 దశకు కూడా చేరుకోకుండానే పాకిస్థాన్ జట్టు నిష్క్రమించింది. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ సూపర్ 8 ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 5 పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది. జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టు వద్ద 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. గ్రూప్-ఏలో ఇతర జట్లేవీ 5 పాయింట్లు సాధించే అవకాశం లేదు. కాబట్టి 5 పాయింట్ల ఉన్న అమెరికా, 6 పాయింట్లతో ఉన్న భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. భారత జట్టు గ్రూప్ లో టాపర్ గా నిలిచింది.

ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో యూఎస్ఏ-ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. చాలా సమయం వేచి చూసినా కూడా మ్యాచ్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేశారు. కొద్దిసేపు ఆగడం.. ఆ తర్వాత వర్షం పడడం.. ఇలా చాలా సేపు మ్యాచ్ ఆడుతున్న జట్లనే కాకుండా.. పాక్ జట్టుతో కూడా వరుణుడు దోబూచులాడాడు. గ్రౌండ్ లోని చాలా భాగాలలో వర్షం నీళ్లు నిలిచే ఉండడంతో ఇక మ్యాచ్ కొనసాగడం కష్టమేనని నిర్వాహకులు ప్రకటించేశారు. ఇక జూన్ 19న సూపర్-8 మ్యాచ్‌లు మొదలవ్వనున్నాయి. ఆంటిగ్వా, బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ వేదికగా మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.


Eha Tv

Eha Tv

Next Story