ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా పాక్ క్రికెటర్..!
భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రాకు (Bumra) నిరాశ ఎదురైంది. తాజాగా నవంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఐసీసీ ప్రకటించిన పేరు తనది కాకపోవడంతో నిరాశ చెందాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) అవార్డును పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం హరీస్ రౌఫ్‌తో పాటు బుమ్రా, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్ పోటీపడ్డారు. చివరికి ఈ అవార్డు హరీస్ రౌఫ్‌కు దక్కింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రౌఫ్ ఉత్తమ ప్రదర్శన చేశాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించడంలో రౌఫ్ కీలక పాత్ర పోషించారు. ఆ సరీస్‌లో రౌఫ్ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకోగా.. సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి పాక్ కప్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా టి-20 సిరీస్‌లో కూడా ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. జింబాబ్వే పర్యటనలో రాణించి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో నవంబర్ నెలలో మొత్తం 18 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు.