Pakistan : టీ20 ప్రపంచకప్ గెలిస్తే.. భారీ నగదు బహుమతి ప్రకటించిన పీసీబీ
అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకా జట్టును ప్రకటించలేదు,
అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకా జట్టును ప్రకటించలేదు, అయితే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఒక్కో ఆటగాడికి రూ. 83.38 లక్షల (1,00,000 US డాలర్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
జూన్‌లో జరిగే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి పాకిస్థాన్ ఈ రెండు దేశాలతో టీ20 సిరీస్‌లను ఆడనుంది. రాబోయే పర్యటనకు ముందు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన లంచ్ వేడుకలో పీసీబీ చీఫ్ ఈ నగదు బహుమతిని ప్రకటించారు.
బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు మే 10 నుంచి 14 వరకు ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత ఆ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. అక్కడ వారు మే 22 నుండి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో పాల్గొనాల్సివుంది.
పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. "ఎవరి గురించి చింతించకండి.. పాకిస్తాన్ కోసం మాత్రమే ఆడండి.. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా నిలబడండి.. విజయం మీదే అవుతుంది. దేశం మీపై గొప్ప అంచనాలు పెట్టుకుంది. ఈసారి మీరు పాకిస్థాన్ జెండా ఊపుతూ వస్తారని ఆశిస్తున్నాం.
ఈ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షాలకు ప్రత్యేక జెర్సీలను బహూకరించారు. T20 క్రికెట్‌లో 3000 పరుగులు చేసినందుకు రిజ్వాన్.. 100 వికెట్లు పూర్తి చేసినందుకు నసీమ్‌ను గౌరవించారు. ఈ వారం ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్‌లలో జరగనున్న టి-20 సిరీస్‌లకు పాకిస్తాన్ జట్టును ప్రకటించింది, కానీ ఇప్పటివరకు వారు ప్రపంచ కప్ జట్టును ప్రకటించలేదు.