ముంబై ఇండియన్స్‌ కు మరో ఓటమి ఎదురైంది. వాంఖడే స్టేడియంలో చెన్నైతో

ముంబై ఇండియన్స్‌ కు మరో ఓటమి ఎదురైంది. వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై. ఈ మ్యాచ్ ఫలితంతో చెన్నై నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, ముంబైకి ఇది నాలుగో ఓటమి. చెన్నై నిర్దేశించిన 207 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ తొలుత దూకుడుగా మొదలుపెట్టింది. రోహిత్‌శర్మ, ఇషాన్ కిషన్ జోడీ జోరుగా ఆడింది. 70 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఇషాన్ కిషన్ (23) వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు. సూర్య తర్వాత వచ్చిన తిలక్ వర్మ (31) పరవాలేదనిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (13), షెపర్డ్ (1) కూడా విఫలమవడంతో ముంబై ఓటమి ఖాయమైంది. రోహిత్‌శర్మ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ (105) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 4 బంతుల్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నై బౌలర్ పతిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Updated On 14 April 2024 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story