టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది

ఐపీఎల్ 2024లో మొదటి మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు బెంగళూరుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 పరుగులు బాదాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 19 బంతులు ఎదుర్కొని 52 పరుగులు కొట్టాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (38) రాణించగా.. ఆరు బంతుల్లో 3 సిక్సర్లు బాదాడు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (21 నాటౌట్), తిలక్ వర్మ (16 నాటౌట్) పరుగులు చేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (3), విల్ జాక్స్ (8) విఫలమయ్యారు. దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 53 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. డుప్లెసిస్ (61), రజత్ పటీదార్ (50) రాణించగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), మహిపాల్ లామ్రోర్ (0), సౌరవ్ చౌహాన్ (9), విజయ్ కుమార్ వైశాక్ (0), ఆకాశ్ దీప్ (2 నాటౌట్) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు బుమ్రా. మిగతా బౌలర్లలో కోయిట్జీ, ఆకాశ్ మధ్వల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తర్వాతి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం తలపడనుంది.

Updated On 11 April 2024 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story