భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది.

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన టోర్నీలోని ఐదో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌(Gujarat Giants)ను రాయల్ ఛాలెంజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. RCB తన మొదటి మ్యాచ్‌లో UP వారియర్స్‌ను ఓడించింది. మరోవైపు గుజరాత్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. అంతకుముందు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana) టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన‌ గుజరాత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 107 పరుగులు చేసింది. అనంత‌రం ఆర్‌సీబీ 12.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది.

ఆర్సీబీ తరఫున కెప్టెన్ స్మృతి మంధాన అత్యధికంగా 43 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన(Sabbhineni Meghana) 28 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఎల్లిస్ పెర్రీ 14 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. గుజరాత్ బౌల‌ర్ల‌లో ఆష్లే గార్డనర్, తనూజా కన్వర్‌లు ఒక్కో వికెట్‌ సాధించారు.

అంతకుముందు గుజరాత్ తరఫున హేమల‌త‌ దయాళన్ అత్యధికంగా అజేయంగా 31 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 22 పరుగులు, స్నేహ రాణా 12 పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మరే బ్యాట్స్‌వుమెన్‌ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఆర్‌సీబీ తరఫున సోఫీ మోలినిక్స్(Sophie Molineux) గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్ ఠాకూర్ రెండు వికెట్లు, జార్జియా వేర్‌హామ్ ఒక వికెట్ తీశారు.

Updated On 27 Feb 2024 8:38 PM GMT
Yagnik

Yagnik

Next Story