Legends League Cricket : 40 ఏళ్ల తర్వాత ఆ గడ్డపై క్రికెట్ మ్యాచ్.. లెజెండ్స్ లీగ్ ఫైనల్ జరిగేది అక్కడే..!
సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడవ సీజన్‌లో శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్‌తో సహా చాలా మంది దిగ్గజాలు కనిపించనున్నారు.
సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడవ సీజన్‌లో శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్‌తో సహా చాలా మంది దిగ్గజాలు కనిపించనున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ క్రికెటర్లు శ్రీనగర్‌లో ఆడనున్నారు. సెప్టెంబర్ 20న జోధ్‌పూర్‌లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో 6 జట్లు 25 మ్యాచ్‌లు ఆడనుండగా.. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ అక్టోబర్ 16న జరగనుంది. ఫైనల్ శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనుంది.
LLC సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా మాట్లాడుతూ.. 'లెజెండ్స్ లీగ్ క్రికెట్ తదుపరి సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి కశ్మీర్‌లో కూడా మ్యాచ్‌లు జరగడం సంతోషంగా ఉంది. 40 ఏళ్ల తర్వాత స్టేడియంలో క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కాశ్మీర్ ప్రజలకు ఇది ఒక అపూర్వ అవకాశం అని ఆయన అన్నారు.
గత సీజన్‌లో భారత్‌లో 18 కోట్ల మంది ఈ లీగ్‌ని వీక్షించారని నిర్వాహకులు తెలిపారు. పోయినసారి సురేష్ రైనా, ఆరోన్ ఫించ్, మార్టిన్ గప్టిల్, ప్రస్తుత భారత కోచ్ గౌతం గంభీర్, క్రిస్ గేల్, హషీమ్ ఆమ్లా, రాస్ టేలర్ వంటి దిగ్గజాలు ఇందులో పాల్గొన్నారు. ఆటగాళ్ల వేలం ఆగస్టు 29న జరగనుంది. శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ చేసిన వెంటనే గబ్బర్ LLCలో చేరాడు. దినేష్ కార్తీక్ కూడా ఇటీవల గబ్బర్ ను అనుసరిస్తూ LLCలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.