ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ఆరంభమవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. కోల్‌కతా నిర్దేశించిన 158 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 7 ఓవర్లలో 65 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్య్రూ రస్సెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీశ్ రాణా (33), రస్సెల్స్ (24), రింకూ సింగ్ (20) హిట్టింగ్ చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, చావ్లా చెరో రెండు వికెట్లు, ఎన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది.

Updated On 11 May 2024 9:40 PM GMT
Yagnik

Yagnik

Next Story