జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో రచ్చ చేశాడు. యశస్వి తుఫాను బ్యాటింగ్ చేసి IPL 2024లో తన మొదటి సెంచరీని సాధించాడు

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో రచ్చ చేశాడు. యశస్వి తుఫాను బ్యాటింగ్ చేసి IPL 2024లో తన మొదటి సెంచరీని సాధించాడు. ముంబై బౌలింగ్ యూనిట్‌పై యశస్వి అద్భుతంగా ఆడి 59 బంతుల్లో సెంచరీ చేశాడు. యశస్వి సెంచరీతో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెన‌ర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు జోస్ బట్లర్‌తో కలిసి యశస్వి 74 పరుగులు జోడించాడు. 35 పరుగుల వద్ద బట్లర్ ఔటయ్యాడు. అయితే మరో ఎండ్‌ నుంచి యశస్వి తన బ్యాటింగ్‌ను కొనసాగించి 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాభై పరుగులు చేసిన తర్వాత యశస్వి రెచ్చిపోయాడు. ఈ క్ర‌మంలోనే 59 బంతుల్లో IPLలో తన రెండవ సెంచరీని సాధించాడు. యశస్వి 60 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ సంజు 28 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌లో సందీప్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సందీప్ తన నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ కిషన్ ను సందీప్ తొలి ఓవర్‌లోనే పెవిలియ‌న్‌కు పంపాడు. ఇషాన్‌కు ఖాతా తెరిచే అవకాశం కూడా సందీప్ ఇవ్వలేదు. దీని తర్వాత మరుసటి ఓవర్‌లో సందీప్.. సూర్యకుమార్ యాదవ్ ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ముంబై బ్యాట్స్‌మెన్‌ల‌లో 65 పరుగులతో తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అత‌నికి వ‌ధేరా(49) మంచి స‌హ‌కారం అందించాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో స్కోరు 200 దాట‌లేదు. ముంబై ప్ర‌స్తుతం ఏడో స్థానంలో కొన‌సాగుతుంది. రాజ‌స్థాన్ తొలి స్థానంలో ఉంది.

Updated On 22 April 2024 9:03 PM GMT
Yagnik

Yagnik

Next Story