ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో 145/5 స్థితిలో హైదరాబాద్ ఓటమి లాంఛనమే అని భావించిన సమయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ 29 బంతుల్లో 63 పరుగులు బాదాడు. 8 సిక్సర్లతో హైదరాబాద్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. చివరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరమవ్వగా 19వ ఓవర్లో క్లాసెన్‌ 3 సిక్సర్లు, షాబాజ్‌ 1 సిక్స్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా క్లాసెన్ తొలి బంతికే సిక్స్‌ కొట్టాడు. దీంతో హైదరాబాద్ గెలుపు ఖాయమని అంతా భావించారు. 2వ బంతికి సింగిల్‌.. 3వ బాల్‌కి షాబాజ్‌ ఖాన్ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా మారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్‌సెన్‌ సింగిల్‌ తీసి క్లాసెన్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. భారీ షాట్‌‌తో మ్యాచ్‌ను ముగించాలని ప్రయత్నించిన క్లాసెన్‌ 5వ బంతికి ఔట్ అయ్యాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ బౌండరీని బాదడంలో విఫలమవ్వడంతో హైదరాబాద్ ఓటమిని మూటగట్టుకుంది.

హైదరాబాద్ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌ (32), అభిషేక్‌ శర్మ (32),రాహుల్‌ త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (18), అబ్దుల్‌ సమద్‌ (15), షాబాజ్‌ అహ్మద్‌ (16) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా 3 వికెట్లు తీశాడు. ఆండ్య్రూ రస్సెల్‌ 2, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ చెరో వికెట్‌ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఆండ్య్రూ రస్సెల్ 25 బంతుల్లో 64 పరుగులు బాదాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఫిల్ సాల్ట్‌ (54) దూకుడుగా ఆడినా.. రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) పర్వాలేదనిపించారు.

Updated On 23 March 2024 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story