Swapanil Kusale : 5 కోట్ల రూపాయలు ప్లస్ ఫ్లాట్ ఇవ్వాలి.... ఎవరి డిమాండ్ ఇది!
ప్యారిస్ ఒలింపిక్స్‌లో(Paris oympics) మెడల్ సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే(Swapanil Kusale) తండ్రి సురేశ్(Suresh) కుసాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో(Paris oympics) మెడల్ సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే(Swapanil Kusale) తండ్రి సురేశ్(Suresh) కుసాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు మహారాష్ట్ర సర్కారు ఇచ్చిన నజరానా పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రీడాకారులను ఎలా గౌరవించాలో హర్యానా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య గెలిచాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ గెల్చుకున్నాడు. ఈ క్రీడాంశంలో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్ ఇతనే! అది కూడా తన తొలి ప్రయత్నంలోనే కావడం గమనార్హం. ఒలింపిక్ పతక విజేతలకు మహారాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే 5 కోట్లు, రజతం గెలిస్తే 3 కోట్లు, కాంస్య గెలిస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. చెప్పినట్టుగా ఇచ్చింది. హర్యానా సర్కారేమో ప్రతి ఒక్కరికి 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. మొన్నటి ఒలింపిక్స్‌లో ఇండియాకు అయిదు వ్యక్తిగత పతకాలు వచ్చాయి. ఇందులో హర్యానా నుంచి నలుగురు ఉంటే, మహారాష్ట్ర నుంచి స్వప్నిల్ ఒక్కడే ఉన్నాడు. మహారాష్ట్రతో పోలిస్తే హర్యానా చిన్న రాష్ట్రమని, అయినా.. మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇక్కడి కంటే భారీ నజరానాలు, ప్రోత్సహకాలు ఇస్తోందని సురేశ్ కుసాలే అంటున్నారు. అదే అతడు ఎమ్మెల్యే లేకపోతే మంత్రి కొడుకు అయి ఉంటే ఇదే రివార్డు ఇచ్చేవారా? అని ప్రశ్నించాడు.
నిజానికి స్వప్నిల్‌కు 5 కోట్ల రూపాయల నగదు అవార్డుతో పాటు బెలేవాడిలోని స్పోర్ట్స్ స్టేడియానికి సమీపంలో ఒక ఫ్లాట్ ఇవ్వాలని సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలంటున్నారు.