2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లంతా నిరాశకు గురయ్యారు.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌(World Cup Final)లో భారత్(Teamindia) ఓటమిని చవిచూసింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. ఆస్ట్రేలియా(Australia) చేతిలో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లంతా నిరాశకు గురయ్యారు. కెప్టెన్ రోహిత్, మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) కన్నీళ్లను కూడా అదుపు చేసుకోలేకపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్(Rohit Sharma) నిరాశే కనిపించింది. అయితే, ఓటమి పాలైనప్పటికీ ఈ భారత జట్టును చూసి గర్విస్తున్నానన్నాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఓటమిపై రోహిత్‌ను ప్రశ్నించగా.. "ఫలితం మాకు అనుకూలంగా లేదు. ఈ రోజు మేం అంత బాగా ఆడలేదు. మేము అన్నివిధాల‌ ప్రయత్నించాము. కానీ మాకు అదృష్టం లేదు. మేము ఇంకా 20- 30 పరుగులు ఎక్కువ చేస్తే బాగుండేది. KL రాహుల్‌, కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని న‌మోదు చేశారు. మేము 270-280 స్కోరు చేస్తామ‌నుకున్నాం.. కానీ వికెట్లు కోల్పోయాం. బోర్డ్‌పై 240 పరుగులు ఉన్నా.. వికెట్లు తీయాలనుకున్నాం. కానీ హెడ్(Travis Head), లాబుస్‌చాగ్నే(Marnus Labuschagne) క్రీజులో పాతుకుపోయారు. రాత్రి బ్యాటింగ్ చేయడానికి వికెట్ కొంచెం మెరుగ్గా ఉందని నేను భావిస్తున్నాను. నేను దీనిని సాకుగా చెప్పదలచుకోలేదు. మేము తగినన్ని పరుగులు చేయలేకపోయాము. గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పినందుకు ఆ ఇద్దరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు క్రెడిట్ దక్కుతుందన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్(Patt Cummins) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. అనంత‌రం ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లకు 241 పరుగులు చేసి విజయం సాధించింది. కంగారూ జట్టులో ట్రావిస్ హెడ్ 141 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మారన్ష్ లాబుషాగ్నే 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 15 పరుగులు, డేవిడ్ వార్నర్ 7, స్టీవ్ స్మిత్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు. గ్లెన్ మాక్స్‌వెల్ అజేయంగా రెండు పరుగులు చేశాడు.

ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ప‌రాజ‌యంతో మూడోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న భారత్ కల చెదిరిపోయింది. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినా.. ఆఖ‌రిదైన 11వ మ్యాచ్ ఫైన‌ల్‌లో టీమిండియా వెనుకబడింది. ఆస్ట్రేలియాతో భారత్ రెండోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఓటమిని చవిచూసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టు చివరిసారిగా 2003లో భార‌త్‌ను ఓడించింది.

Updated On 19 Nov 2023 11:19 PM GMT
Yagnik

Yagnik

Next Story