మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జ‌ట్ల‌ మధ్య గురువారం జ‌రిగిన‌ మూడో, చివరి మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్(India)-దక్షిణాఫ్రికా(South Africa) జ‌ట్ల‌ మధ్య గురువారం జ‌రిగిన‌ మూడో, చివరి మ్యాచ్‌లో టీమిండియా(Teamindia) 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌(Boland Park)లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 296 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. తొలి మ్యాచ్‌లోనూ భార‌త్‌ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. టీమిండియా ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. చివరిసారి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలో 2018లో సిరీస్‌ గెలిచింది.

ఛేద‌న‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. జ‌ట్టులో టోనీ డి జార్జి(Tony de Zorzi) అత్యధికంగా 81 పరుగులు చేశాడు. జార్జి గత మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈసారి అలా చేయలేకపోయాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 36 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) 21, రీజా హెండ్రిక్స్(Reeza Hendricks) 19, బ్యూరెన్ హెండ్రిక్స్(Beuran Hendricks) 18, కేశవ్ మహరాజ్ 10 పరుగులు చేశారు. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీశాడు. సిరీస్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లు తలో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు భారత్ తరఫున సంజూ శాంసన్(Sanju Samson) 108 పరుగులు, తిలక్ వర్మ(Tilak Varma) 52 పరుగులు చేశారు. శాంసన్ త‌న వ‌న్డే కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించగా.. తిలక్ త‌న‌ మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రింకూ సింగ్(Rinku Singh) 27 బంతుల్లో 38 పరుగులు, తొలి వన్డే ఆడిన రజత్ పాటిదార్ 16 బంతుల్లో 22 పరుగులు, కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) 35 బంతుల్లో 21 పరుగులు చేశారు. 14 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్(Washington Sundar), 10 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔట్ అయ్యారు. దక్షిణాఫ్రికా జ‌ట్టులో బ్యూరెన్ హెండ్రిక్స్ గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టాడు. నాండ్రే బెర్గర్ రెండు వికెట్లు తీశాడు. లిజాద్ విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన శాంస‌న్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గొలుచుకోగా.. అర్ష్‌దీప్‌ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Updated On 21 Dec 2023 8:40 PM GMT
Yagnik

Yagnik

Next Story