WTC Final 2023 : విజయానికి 280 పరుగుల దూరంలో టీమిండియా
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఎదుట 444 పరుగుల లక్ష్యం ఉంది.

India at 164-3, needs 280 runs in 97 overs
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్ మ్యాచ్ భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్(Oval)లో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఎదుట 444 పరుగుల లక్ష్యం ఉంది. చేధనకు దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆటకు చివరి రోజైన ఐదో రోజున విజయానికి 280 పరుగులు కావాలి. విరాట్ కోహ్లి(Virat Kohli) 60 బంతుల్లో 44 పరుగులు, అజింక్య రహానే(Ajinkya Rahane) 59 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా క్రీజులో నిలిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 118 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.
అంతకుముందు శుభ్‌మన్ గిల్(Shubhman Gill), రోహిత్ శర్మ(Rohit Sharma) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అనంతరం శుభ్‌మన్ గిల్(18) వివాదాస్పద క్యాచ్ అవుట్ అవడంతో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన బంతికి స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూ(LBW)గా ఔటయ్యాడు. రోహిత్ 60 బంతుల్లో 43 పరుగులు చేశాడు. పుజారా(Pujara)తో కలిసి రోహిత్ రెండో వికెట్‌కు 77 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం పాట్ కమిన్స్ వేసిన బంతిని అప్పర్ కట్ ఆడబోయి పుజారా వికెట్ సమర్పించుకున్నాడు. పుజారా 47 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వీరిద్దరి వికెట్ల తర్వాత కోహ్లి, రహానే జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ చెత్త బంతులను బౌండరీ లైన్ దాటించారు. ఇక ఐదో రోజు కూడా వీరిద్దరిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
