భారత్-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది.

భారత్-దక్షిణాఫ్రికా(India vs Southafrica) మధ్య మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్‌(Centurion)లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌(Super Sport Park Stadium)లో తొలి టెస్టు జరగనుంది. మూడు ద‌శాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో టీమిండియా ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా(Teamindia) సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మైంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం(Rain) అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. తొలి టెస్టుకు వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం కూడా ఉందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

భారత్(India)-దక్షిణాఫ్రికా(Southafrica) మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉందని సూపర్‌స్పోర్ట్ పార్క్ క్యూరేటర్ బ్రియాన్ బ్లాయ్ తెలిపారు. సూపర్‌స్పోర్ట్ పార్క్‌లోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని.. బ్యాట్స్‌మెన్‌లకు కొన్ని సవాళ్లను విసురుతుందని భావిస్తున్నారు. టెస్టు తొలిరోజు, రెండో రోజు చాలా వరకు ఆడే అవకాశం తక్కువని చెప్పారు. భారీ వర్షం కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉంటుంది.. ఇది స్పిన్నర్లకు పెద్దగా ఉపయోగపడదని పేర్కొన్నారు. "ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది" అని బ్లాయ్ చెప్పారు. ప్రస్తుతం ఉష్ణోగ్రత 34 డిగ్రీలు కాగా.. 20 డిగ్రీలకు పడిపోనుంది. మొదటి రోజు ఆడతామో లేదో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మూడో రోజు ఆట బాగానే ఉంటుందని ఆశిస్తున్నా.. పిచ్‌(Pitch)పై ఎంత మలుపు ఉంటుందో తెలియదని అన్నారు.

అక్యూవెదర్ ప్రకారం.. టెస్ట్ మొదటి రోజు వర్షం పడే అవకాశం 96 శాతం ఉంది. పగటిపూట సెంచూరియన్‌లో భారీ వర్షం కురుస్తుంది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం 94 శాతం ఉంది. కనీసం నాలుగు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 42 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. టీమ్ ఇండియా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆతిథ్య జట్టు 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఏడు డ్రాగా మిగిలాయి.

ఇరు జట్లు

భారత్ :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ (wk), KS భరత్ (wk), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా :

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్గి, డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్ (వికెట్), ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్), కైల్ వెర్రేయన్, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ.

Updated On 25 Dec 2023 10:18 PM GMT
Yagnik

Yagnik

Next Story