మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యాన్ని బంగ్లాదేశ్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం మార్చేసింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యాన్ని బంగ్లాదేశ్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం మార్చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకూ జరగనున్న ఈ గ్లోబల్ టోర్నమెంట్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనుంది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో అరాచక పరిస్థితులు నెలకొనడంతో మాజీ ప్రధాని షేక్ హసిన్ తన పదవిని, దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన విష‌యం తెలిసిందే.

ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనల దృష్ట్యా అక్క‌డ‌కు వెళ్లవద్దని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇప్పుడు దుబాయ్, షార్జాలో జరగనున్నాయి. ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఒక చిరస్మరణీయమైన ఈవెంట్‌ను నిర్వహిస్తుందని మాకు తెలుసు.. ఈ ఈవెంట్‌ను బంగ్లాదేశ్‌లో నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేసినందుకు నేను బీసీబీ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే.. పాల్గొనే అన్ని జట్ల ప్రభుత్వాలు జారీ చేసిన ప్రయాణ సూచ‌న‌ల‌ ప్రకారం టోర్నమెంట్‌ను అక్కడ నిర్వహించడం సాధ్యం కాదు. అయినప్పటికీ వారు హోస్టింగ్ హక్కులను కలిగి ఉంటారు. సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించడానికి మేము ఎదురుచూస్తున్నామన్నారు. ఆతిథ్యమివ్వడానికి ఉదారంగా ఆఫర్లు ఇచ్చినందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, శ్రీలంక, జింబాబ్వేలకు ఐసీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రెండు దేశాల్లో వ‌చ్చే ICC గ్లోబల్ ఈవెంట్‌లు జరుగుతాయని మేము ఎదురుచూస్తున్నామన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story