197 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ఆరంభించిన గుజ‌రాత్ ప్రారంభంలో బాగానే ఆడింది

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 197 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఆఖ‌రి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. జీటీ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ (72), సుద‌ర్శ‌న్ (35) ప‌రుగుల‌తో రాణించారు. చివ‌ర‌లో ర‌షీద్ ఖాన్ (24 నాటౌట్‌), రాహుల్ తెవాటియా (22) హిట్టింగ్ తో రాజస్థాన్ కు ఈ సీజన్ లో తొలి ఓటమి దక్కేలా చేశారు. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్‌కు రియాన్ ప‌రాగ్ (76), కెప్టెన్ సంజు శాంస‌న్ (68 నాటౌట్‌) అర్ధ శ‌త‌కాల‌తో 196 ప‌రుగుల స్కోర్ అందించారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ ఓపెన్ల‌రు య‌శ‌స్వీ జైస్వాల్ (24), బ‌ట్ల‌ర్ (08) మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. రాజ‌స్థాన్ ఆఖ‌రి 10 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగులు చేయ‌డం విశేషం. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

197 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ఆరంభించిన గుజ‌రాత్ ప్రారంభంలో బాగానే ఆడింది. 8 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 64 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ కుల్‌దీప్ సేన్ ధాటికి గుజ‌రాత్ 11 ఓవర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి కేవ‌లం 83 ప‌రుగులే చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ 29 బంతుల్లో 35 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కెప్టెన్ గిల్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 72 ప‌రుగులు చేశాడు. గుజ‌రాత్‌కు విజ‌యానికి చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. షారూక్ ఖాన్‌, తెవాటియా.. అశ్విన్ వేసిన‌ 17 ఓవ‌ర్‌లో ఏకంగా 17 ప‌రుగులు రాబ‌ట్టారు. 18వ‌ ఓవ‌ర్‌లో గుజ‌రాత్ షారుక్ వికెట్‌ను కోల్పోయి కేవ‌లం 7 ప‌రుగులే చేసింది. దీంతో ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో టైటాన్స్‌కు 35 రన్స్ కావాల్సి వ‌చ్చింది. 19 ఓవ‌ర్ వేసిన కుల్దీప్ సేన్ ఒక్క ఓవ‌ర్‌లోనే 20 ప‌రుగులు ఇచ్చాడు. ఆఖరి 6 బంతుల్లో 15 ప‌రుగులు కావాల్సి ఉండగా.. ఆఖ‌రి ఓవ‌ర్ అవేశ్ ఖాన్ వేశాడు. తొలి నాలుగు బంతుల్లో ర‌షీద్ 11 (4, 2, 4, 1) రన్స్ చేశాడు. ఐదో బంతికి మూడో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి తెవాటియా రనౌట్ అయ్యాడు. చివ‌రి బంతికి గుజ‌రాత్ విజ‌యానికి 2 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా.. ర‌షీద్ ఖాన్ బౌండ‌రీ కొట్ట‌డంతో టైటాన్స్ విజయం సాధించింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో కుల్దీప్ సేన్ 3 వికెట్లు తీయ‌గా.. చాహ‌ల్ 2, అవేష్ ఖాన్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

Updated On 10 April 2024 8:55 PM GMT
Yagnik

Yagnik

Next Story