YuvrajSingh BJP: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన యువరాజ్
సన్నీ డియోల్ స్థానంలో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌పై యువరాజ్ సింగ్ పోటీ చేస్తారని మీడియాలో కొన్ని నివేదికలు వచ్చాయి
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏ ప్రముఖులు రాజకీయ మైదానంలో దిగుతారో అసలు ఊహించలేము. తాజాగా భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. ఈ వార్తలు చివరికి యువరాజ్ సింగ్ దాకా చేరాయి. దీంతో యువరాజ్ సింగ్ స్పందించాల్సి వచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్నాడంటూ మీడియాలో వచ్చిన వార్తలను యువరాజ్ సింగ్ ఖండించాడు.యువరాజ్ సింగ్ తన వైఖరిని స్పష్టం చేయడానికి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని, యువికెన్ అనే ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటానని చెప్పారు.
"మీడియా కథనాలను చూసాను. నేను గురుదాస్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు మద్దతివ్వడం, సహాయం చేయడం నా అభిరుచి, నా ఫౌండేషన్ యు.వి.కెన్. ద్వారా నేను దీన్ని కొనసాగిస్తాను. మార్పు రావడం కోసం ప్రయత్నిద్దాం" అని యువరాజ్ సింగ్ పోస్ట్‌లో తెలిపాడు. గురుదాస్‌పూర్ నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నటుడు సన్నీ డియోల్ స్థానంలో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌పై యువరాజ్ సింగ్ పోటీ చేస్తారని మీడియాలో కొన్ని నివేదికలు వచ్చాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ సమావేశమైన తర్వాత ఈ నివేదికలు వెలువడ్డాయి.
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక దిగ్గజం. యువరాజ్ కెరీర్ లో అనేక మైలురాళ్లు ఉన్నాయి. 2007 T20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో అతని ఆరు వరుస సిక్సర్‌లు, కేవలం 12 బంతుల్లోనే వేగవంతమైన T20I ఫిఫ్టీని (అప్పట్లో) నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో సంచలనాలు. ఇక భారతజట్టు 2011 ICC ప్రపంచ కప్ విజయంలో అతని కీలక పాత్ర కీలకం. అతను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. అది కూడా క్యాన్సర్ తో పోరాడుతూ కప్ ను సాధించేందుకు చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరికీ ఒక ఇన్స్పిరేషన్.