DC Vs CSK IPL 2024 : సీఎస్కేను గెలిపించలేకపోయిన ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..!
ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ను ఓడించింది.
ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals).. ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ను ఓడించింది. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లిద్దరూ ఏడు పరుగుల స్కోరు వద్ద పెవిలియన్ బాట పట్టారు. రితురాజ్ గైక్వాడ్ ఒక పరుగు, రచిన్ రవీంద్ర రెండు పరుగులు చేసి వెనుదిరిగారు. ఖలీల్ అహ్మద్ వారిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అజింక్య రహానే, డారిల్ మిచెల్ మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 11వ ఓవర్ రెండో బంతికి అక్షర్ పటేల్ మిచెల్(34)ను అవుట్ చేశాడు. శివమ్ దూబే(18) ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఆకట్టుకోలేకపోయాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసి అజింక్య రహానే వెనుదిరగడంతో జట్టుకు మరో గట్టి దెబ్బ తగిలింది.
ఈ మ్యాచ్‌లో ముఖేష్ కుమార్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 14వ ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. మొదట రహానె (45)ని అవుట్ చేసి, తర్వాతి బంతికి సమీర్ రిజ్వీని పెవిలియన్ పంపాడు. శివమ్ దూబే కూడా ముఖేష్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.
మహేంద్ర సింగ్ ధోనీ ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోనీ 16 బంతులు ఎదుర్కొని 37 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్సులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు వచ్చాయి. అయినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. రవీంద్ర జడేజా 21 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ-జెడ్డు మధ్య 51 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది, కానీ వారు జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ జట్టులో పృథ్వీ షా(43), వార్నర్(52), పంత్(51) రాణించారు.