168 ప‌రుగుల‌ లక్ష్యఛేదనతో బ‌రిలోకి దిగిన‌ ఢిల్లీ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది

సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. లక్నోపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 168 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో మెక్‌గ‌ర్క్ అర్ధ శ‌త‌కం (55) తో రాణించ‌గా, కెప్టెన్ రిష‌భ్ పంత్ 24 బంతుల్లోనే 41 ప‌రుగులతో మంచి టచ్ లో ఉన్నానని నిరూపించుకున్నాడు.

టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన‌ లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్ (19), దేవదత్ పడిక్కల్ (3), మార్కస్ స్టొయినిస్ (8), నికోలస్ పూరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) పర్వాలేదనిపించగా.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన‌ దీపక్ హుడా (10) , కృనాల్ పాండ్యా (3) కూడా జట్టును ఆదుకోలేకపోయారు. ల‌క్నో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆయుష్ బదోనీ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 55 పరుగులు బాదాడు. మరో ఎండ్‌లో అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 2 బౌండ‌రీల‌తో 20 పరుగులు చేశాడు. ఎనిమిదో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

168 ప‌రుగుల‌ లక్ష్యఛేదనతో బ‌రిలోకి దిగిన‌ ఢిల్లీ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8) త్వరగా అవుట్ అయినా.. పృథ్వీ షా 22 బంతుల్లో 32 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. పృథ్వీ షా అవుట్ అయిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ రిష‌భ్ పంత్‌.. అప్ప‌టికే క్రీజులో కుదురుకున్న మెక్‌గ‌ర్క్ తో కలిసి ధాటిగా ఆడాడు. మెక్‌గ‌ర్క్, పంత్ ద్వ‌యం 77 ప‌రుగుల భాగ‌స్వామ్యం జోడించి ఢిల్లీ గెలుపు కన్ఫర్మ్ చేశారు. చివ‌ర్లో స్ట‌బ్స్ (15 నాటౌట్‌), షై హోప్ (11 నాటౌట్‌) లక్ష్యాన్ని పూర్తి చేశారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయి 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. న‌వీన్ ఉల్‌ హ‌క్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

Updated On 12 April 2024 9:45 PM GMT
Yagnik

Yagnik

Next Story