వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 ఫైనల్ రేసు రసకందాయంగా మారింది. టెస్ట్‌లు జరుగుతున్న కొద్దీ సమీకరణలు మారుతున్నాయి.

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 ఫైనల్ రేసు రసకందాయంగా మారింది. టెస్ట్‌లు జరుగుతున్న కొద్దీ సమీకరణలు మారుతున్నాయి. ప్రస్తుతం టాప్‌ -2లో నిలిచేందుకు అయిదు టీమ్‌లు పోటీపడుతున్నాయి. మరో 15 టెస్ట్‌ మ్యాచ్‌లు ఈ సైకిల్‌లో మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఓ జట్టు కూడా ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోలేదు. ఇప్పటికైతే టీమిండియానే టాప్‌ ప్లేస్‌లో ఉంది. అగ్రస్థానాన్ని కొనసాగించాలంటే రాబోయే టెస్ట్‌లలో ఇండియా తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇండియా(INDIA)తో పాటు ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(SouthAfrica), శ్రీలంక(SriLanka), న్యూజిలాండ్‌లు(NewZealand) ఫైనల్‌ కోసం పోటీపడుతున్నాయి. ఇండియాలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్‌ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అదే సమయంలో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ చిత్తు చేసింది. శ్రీలంకను సౌతాఫ్రికా ఓడించడంతో సమీకరణాలు మళ్లీ మారాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత్‌కు సంక్లిష్టమైన పరిస్థితే ఉండింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-0తో సిరీస్‌ను గెలవాల్సిన పరిస్థితి. అయితే పెర్త్‌లో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ 61.11 శాతంతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సైకిల్‌లో మరో 4 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌.. సిరీస్‌ను 4-1, 3-0తో గెలిచినా.. 2-2తో డ్రా అయినా ఫైనల్‌ చేరే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాను 3-0తో ఓడిస్తే భారత్‌.. 62.28 పాయింట్లతో డబ్ల్యూటీసీని ముగిస్తుంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2-2తో డ్రా అయినా టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుతుంది. అయితే ఇలా జరగాలంటే శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలవాలి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక.. 1-0తో గెలిస్తే భారత్‌ మూడోసారి ఫైనల్‌ చేరే ఛాన్సు ఉంటుంది. ఇదిలా ఉంటే డర్బన్‌ టెస్టులో శ్రీలంకపై ఘన విజయం సాధించడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు భారత్‌ తర్వాత 59.26 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత సైకిల్‌లో దక్షిణాఫ్రికా టీమ్‌ శ్రీలంకతో మరో టెస్టు, పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. ఇవన్నీ స్వదేశంలోనే కావడం గమనార్హం. ఈ మూడింటిలో రెండు గెలిస్తే టాప్‌-2లో నిలుస్తుంది. ఒకవేళ టీమిండియా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని దక్కించుకుంటే, స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాను ఓడిస్తే అప్పుడు టాప్‌-2 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. ఆస్ట్రేలియా మరో ఆరు మ్యాచ్‌లు (ఇండియాతో 4, శ్రీలంకతో 2) ఆడాల్సి ఉంది. వీటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ఆ టీమ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరుతుంది. భారత్‌తో సిరీస్‌ను 3-2తో కోల్పోయినా శ్రీలంకను 2-0తో ఓడిస్తే ఆ జట్టు టాప్‌-2లో నిలుస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓడిపోయినప్పటికీ శ్రీలంకకు కూడా ఛాన్సు ఉంది. ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో రెండు స్వదేశంలోనే! స్వదేశంలో 1-0తో ఆస్ట్రేలియాను అడ్డుకున్నా ఫైనల్‌ రేసులో ఉండటానికి చాన్స్‌ ఉంది.

ehatv

ehatv

Next Story