ఉపఖండపు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు చట్టబద్ధమైన హెచ్చరిక.. బ్లడ్‌ప్రెషర్‌, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నవారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియా-పాకిస్తాన్‌(India Vs Pakistan) మ్యాచ్‌కు దూరంగా ఉండటం మంచిది కాదు, కూడదు చూసి తీరాల్సిందే అంటే బీపీ టాబ్లేట్లు రెడీగా పెట్టుకోండి.

ఉపఖండపు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు చట్టబద్ధమైన హెచ్చరిక.. బ్లడ్‌ప్రెషర్‌, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నవారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియా-పాకిస్తాన్‌(India Vs Pakistan) మ్యాచ్‌కు దూరంగా ఉండటం మంచిది కాదు, కూడదు చూసి తీరాల్సిందే అంటే బీపీ టాబ్లేట్లు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఆషామాషీ మ్యాచ్‌ కాదు. నరాలు తెగిపడే ఉత్కంఠ.. వేలి కొసలమీదున్న గోర్లు కొరుక్కోవడానికి కూడా మిగలనంత టెన్షన్‌.. తెలియని ఉద్విగ్నత.మధ్యమధయలో కాసింత ఉద్రేకం. సుమారు 165 కోట్ల ఉపఖండ ప్రజలు ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇది!
భారత్‌-పాకిస్తాన్‌.తరాల నుంచి ఏదో తెలియని అంతరం.నాలుగు యుద్ధాల శతృత్వం. సరిహద్దు చెరిపేసిన సౌభ్రాతృత్వం. అందుకే రెండు దేశాల మధ్య ఎలాంటి పోటీ అయినా అది సమరాంగణాన్ని తలపిస్తుంది..సబ్‌ కాంటినెంట్‌ గుండె చప్పుడైన క్రికెట్‌ అయితే వేరే చెప్పాలా? ఇప్పుడదే జరుగుతోంది
ప్రత్యేకమైన వాతావరణ సూచన. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు 1,186 కిలోమీటర్ల దూరంలో, భారత రాజధాని ఢిల్లీకి 943 కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్‌ నగరం కేంద్ర బిందువుగా శనివారం క్రికెట్‌ ప్రకంపనలు ఏర్పడే అవకాశం వుంది. దాని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై పది దాటినా ఆశ్చర్యపడనక్కర్లేదు... ఆ ఎఫెక్ట్‌ రెండు దేశాల మీదా పడే అవకాశాలున్నాయి.
కేవలం స్వేదమే తప్ప రక్తం చిందదు కానీ, అంతటి ఉద్విగ్నత ప్రజ్వరిల్లుతుంది. వికెట్లే తప్ప ప్రాణాలు రాలిపడవు కానీ, అంతకన్నా ఎక్కువ ఉత్కంఠ రాజ్యమేలుతుంది. పరుగులే తప్ప మరే ప్రతి దాడులుండవు కానీ, గుండె ఆ కాసేపూ లబ్ డబ్ బదులు రన్ రన్ అని కొట్టుమిట్టాడుతుంది. ఇదీ భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ స్వరూప స్వభావాలు.
చతురంగ బలాలేవీ అక్కడ వుండవు.కదం తొక్కే సైనిక కవాతులేవీ వుండవు. శతఘ్నులు, యుద్ధ టాంకులు మోహరించవు. కానీ అక్కడ మాత్రం రణ నినాదం వినిపిస్తుంటుంది. స్టేడియంలో అరుపులు. కేరింతలు.కేకలు.మధ్యమధ్యన ఉస్‌స్‌స్‌మన్న నిట్టూర్పులు.పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌లు.అరక్షణమైనా చూపు తిప్పుకోబుద్దేయదు..! ఏదో మహాద్భుతమైన దృశ్యాన్ని మిస్సవుతామేమోనన్న భయం.
భారత్ పాక్ మధ్య మ్యాచ్. ప్రపంచంలోని అన్ని విషయాలను పక్కన పెట్టే సమయమది. అట్ ది సేమ్ టైమ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు దేశాల గురించి కాస్తో కూస్తో తెలిసిన వారందరూ కన్నేసే సన్నివేశమది.క్రికెట్ అంటే ఆసక్తి లేకున్నా ఆ పోరు చూసే తీరాలన్న తలంపు సై అంటే సై అనే సమయమది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఆ ఉత్కంఠభరిత సమరాన్ని తిలకించి పులకరించని క్రీడాభిమాని ఉండడు. అంతటి క్రేజుందీ కర్రల మధ్య పరుగులు పెట్టి ప్రతాపాలు చూపే యుద్ధానికి.
భారత్‌-పాక్‌ మధ్య ఏ క్రీడా సమరమైనా రంజుగానే వుంటుంది.అది క్రికెటైతే మరింత పసందుగా వుంటుంది. మామూలు మ్యాచుల్లోనే భావోద్వేగాలు లావాలా చిమ్ముకునివస్తే. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లో ఇంకెంత వుండాలి? బీపీ పాదరసాన్ని బద్దలు కొట్టదూ! టెన్షన్ 400 కిలోవాట్స్‌ దాటదూ! అది లీగ్ మ్యాచ్ అయినా దాదాపు ఫైనల్ మ్యాచ్ కాదు కదా అన్నంతగా రెండు దేశాల్లోనూ ఒకటే టెన్షన్‌. శనివారం అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌ అలాంటిదే! ఆ టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ లో ఎవరూ ఆజ్యం పోయకుండానే అగ్గి ఆకాశానికి అంటుతుంది. బొర్డర్లలో సైనికుల అంతరంగాల్లా ప్రతి ఒక్కరి మనసులూ ఉత్తుంగ-తరంగాలై ఎగసెగసి పడుతుంటాయ్.
మ్యాచ్‌ ఉపఖండంలో జరుగుతుండటంతో ఇరు దేశాల పతాకాల రెపరెపలు. జాతీయ గీతాలాపనలు. ఆయా దేశాల గుర్తుల ఛాయలు. అభిమానుల కేరింతలూ.. బాలు బాలుకూ మరింత ఎక్కువవుతూ సాగుతుంది. రన్ను రన్నుకూ మధ్య గన్ను పేల్చకుండానే అంతటి ఫైరు. బాంబులేయకుండానే అంతటి హోరు. మిస్సైళ్ళు వదలకుండానే అంతటి స్పీడు. విపరీతమైన యుద్ధతంత్రం అమలవుతూ అదో టైపు వాతావరణం నడుస్తుంది. ఒత్తిడి. జనాలకే ఇంత ఒత్తిడి వుంటే, ఇక గోదాలో దిగే ప్లేయర్లకెంత వుండాలి! అసలు నిద్ర పడుతుందా? పట్టినా పీడకలలు వెంటపడి వేధించవూ!
దాదాపు లక్షా ముప్ఫైవేలు ప్రేక్షకులు పట్టే ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగబోతున్నది. అంతపెద్ద స్టేడియం అభిమానులతో నిండిపోతే ఆ దృశ్యమే కన్నుల పండుగగా ఉంటుంది. వన్డే ప్రపచకప్‌లో తలపడిన ఏడుసార్లూ భారత్‌దే విజయం. ఇటీవల ఆసియా కప్‌లో కూడా పాకిస్తాన్‌ను రోహిత్‌ సేన ఓడించింది. ఏ రకంగా చూసినా టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌. అలాగని పాకిస్తాన్‌ టీమ్‌ను తీసిపారేయ్యడానికి లేదు. ఆ జట్టులోనూ కొందరు డేంజరస్‌ ప్లేయర్లు ఉన్నారు. ఇండియాతో పాటు పాక్‌ కూడా ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే!
బలాబలాలు ఎలా ఉన్నా...ఇట్స్‌ ఆల్‌ ఇన్‌ ది గేమ్‌.ఆ రోజు ఎవరు నక్కతోక తొక్కి గ్రౌండ్‌లో అడుగు పెడతారో వాళ్ల లక్కు పండుతుందంతే. ఆటను మలుపు తిప్పడానికి రెండు ఓవర్లు సరిపోవూ! వన్డే మ్యాచ్‌ అంటేనే అది! రిపైర్‌ చేసుకోడానికి కుదరదు.ప్లేయర్‌ మిస్టేక్‌ చేశాడా అంతే!
ఫైనల్‌ టీమ్స్‌ ఇలా ఉండవచ్చు...
ఇండియా :
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌ లేదా ఇషాన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌/షమి, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌.
పాకిస్థాన్‌:
షఫీక్‌, ఇమాముల్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, సాద్‌ షకీల్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌, నవాజ్‌, షహీన్‌, రవూఫ్‌, హసన్‌ అలీ.

Updated On 13 Oct 2023 11:48 PM GMT
Ehatv

Ehatv

Next Story