సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్(IPL) ఆరంభ మ్యాచ్‌లోనే అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నామన్నట్టుగా ఆటగాళ్ల తీరు ఉంది. చెప్పుకోదగ్గ భాగస్వామ్యమే లేకుండా పోయింది. విచిత్రమేమిటంటే టాప్ -5 బ్యాటర్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా సిక్సర్ బాదలేకపోవడం. పోనీ బౌలింగ్ అయినా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. ప్రత్యర్థి జట్టుకు రెండు వందలకు పైగా పరుగులు సమర్పించుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్(IPL) ఆరంభ మ్యాచ్‌లోనే అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నామన్నట్టుగా ఆటగాళ్ల తీరు ఉంది. చెప్పుకోదగ్గ భాగస్వామ్యమే లేకుండా పోయింది. విచిత్రమేమిటంటే టాప్ -5 బ్యాటర్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా సిక్సర్ బాదలేకపోవడం. పోనీ బౌలింగ్ అయినా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. ప్రత్యర్థి జట్టుకు రెండు వందలకు పైగా పరుగులు సమర్పించుకుంది. బ్యాటింగ్‌లో మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ మళ్లీ తేరుకోలేకపోయింది. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ జట్టు 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. అన్ని రంగాల్లో రాణించిన రాజస్తాన్ రాయల్స్ ఈ విజయం దక్కడం విశేషమేమీ కాదు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)ను బ్యటింగ్‌కు దింపింది. ఇది కూడా ఒక తప్పిదమే! సన్‌రైజర్స్ బౌలింగ్ నాసిరకంగా ఉండటంతో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మొదటి ముగ్గురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జోస్ బట్లర్ 22 బంతుల్లో ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేయగా, కెప్టెన్ సంజూ సామ్సన్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 55 పరుగులు, యశస్వీ జైస్వాల్(yashasvi jaiswal) 37 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 54 పరుగులు చేశారు. తర్వాత బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. అబ్దుల్ సమద్ 32 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేయడమొక్కటే చెప్పుకోదగిన అంశం. రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ చహల్ 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. పవర్‌ప్లేలో రాజస్తాన్ ఓపెనర్లు యశస్వీ, బట్లర్ విపరీతంగా పరుగులు రాబట్టుకున్నారు. అదే హైదరాబాద్ మళ్లీ తేరుకోకుండా చేసింది. మధ్యలో హైదరాబాద్ బౌలర్లు బాగానే వేశారు. ఏడు నుంచి 15 ఓవర్ల మధ్యలో రాజస్తాన్ 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత డెత్ ఓవర్లలో కూడా రాజస్తాన్ గొప్పగా పరుగులేమీ చేయలేదు. చివరి అయిదు ఓవర్లలో రాజస్తాన్ కేవలం 43 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను వేసినట్టే. కాకపోతే భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం కారణంగానే రాజస్తాన్ జట్టు 200 పరుగులకు పైగా స్కోరు చేయగలిగింది. పెద్ద టార్గెట్‌ను ఛేజ్ చేస్తున్నప్పుడు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది. కానీ ఆరంభంలోనే బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లోనే అభిషేక్ వర్మ(Abhishek Verma), రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi)లు తమ పరుగుల ఖాతాను ఆరంభించకముందే వెనుదిగిగారు. పవర్‌ప్లేలో హైదరాబాద్ కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పూర్తిగా నిరాశపర్చాడు. 13.25 కోట్ల రూపాయలతో ఇతడిని హైదరాబాద్ కొనుక్కుంది. మొదటి మ్యాచ్‌లో ఇతను ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. చివర్లో సమద్ ధాటిగా ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌ను శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లక్నోలో ఆడుతుంది.
స్కోరు బోర్డు
రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)
యశస్వి (సి) మయాంక్ (బి) ఫజల్ 54; బట్లర్ (బి) ఫజల్ 54; సామ్సన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55; పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2; పరాగ్ (సి) ఫజల్ (బి) నటరాజన్ 7; హెట్‌మైర్ (నాటౌట్) 22; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–85, 2–139, 3–151, 4–170, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–36–0, ఫజల్ హఖ్ 4–0–41–2, సుందర్ 3–0–32–0, నటరాజన్ 3–0–23–2, ఆదిల్ రషీద్ 4–0–33–0, ఉమ్రాన్ 3–0–32–1.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)
అభిషేక్ శర్మ (బి) బౌల్ట్ 0; మయాంక్ (సి) బట్లర్ (బి) చహల్ 27; త్రిపాఠి (సి) హోల్డర్ (బి) బౌల్ట్ 0; హ్యారీ బ్రూక్ (సి) చహల్ 13; సుందర్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 1; ఫిలిప్స్ (సి) ఆసిఫ్ (బి) అశ్విన్ 8; సమద్ (నాటౌట్) 32; రషీద్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 18; భువనేశ్వర్ (బి) చహల్ 6; ఉమ్రాన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–34, 4–39, 5–48, 6–52, 7–81, 8–95. బౌలింగ్: బౌల్ట్ 4–1–21–2, ఆసిఫ్ 3–0–15–0, హోల్డర్ 3–0–16–1, అశ్విన్ 4–0–27–1, చహల్ 4–0–17–4, నవదీప్ సైనీ 2–0–34–0.