ఐపీఎల్ 2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి
ఐపీఎల్ 2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. చెరో 8 విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారవ్వగా మిగతా రెండు స్థానాల విషయంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలకు గండి పడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లను ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు 5 విజయాలను నమోదు చేసింది. దీంతో ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ గత రాత్రి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. గుజరాత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసింది. ఈ జంట తొలి వికెట్‌కు 210 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.