ఖచ్చితంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను అదే సమయంలో ఒక భయంకరమైన తప్పు చేసాను
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆర్సీబీ సహచరుడు విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో డివిలియర్స్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. కోహ్లితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్న డివిలియర్స్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలకు బిడ్డ పుట్టబోతున్నాడంటూ ప్రకటన చేశాడు. అయితే ఈ వార్తలకు సంబంధించి డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయని.. ఒకరి పర్సనల్ లైఫ్ గురించి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని డివిలియర్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
నా యూట్యూబ్ షోలో నేను చెప్పినట్లు ఖచ్చితంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను అదే సమయంలో ఒక భయంకరమైన తప్పు చేసాను. ఓ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నాను. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను చేయగలిగేది అతనికి శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే.. విరాట్ కోహ్లీ విరామం తీసుకోడానికి కారణం ఏమైనప్పటికీ అతను బలంగా, మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలని.. తిరిగి వస్తాడని నిజంగా ఆశిస్తున్నానని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ తెలిపాడు.
కోహ్లీ క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోహ్లి ఇంగ్లండ్ తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమైనప్పటికీ.. మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై క్లారిటీ లేకుండా పోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా కోహ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనిశ్చితి నెలకొంది. కోహ్లీ పరిస్థితిపై స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.