IPL 2024 : ఆర్సీబీ ఓటమి.. విజయంతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2024 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయంతో ప్రారంభించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో CSK 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
ఐపీఎల్ 2024 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయంతో ప్రారంభించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో CSK 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెపాక్ మైదానంలో 16 ఏళ్ల కరువుకు స్వస్తి పలకాలన్న RCB కల మరోసారి కలగానే మిగిలిపోయింది.
174 పరుగుల విజయలక్ష్యంతో ఛేదన ప్రారంభించిన చెన్నైకి మంచి ఆరంభం దక్కలేదు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. దీని తర్వాత అజింక్యా రహానేతో కలిసి రచిన్ రవీంద్ర CSK ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రచిన్ తన అరంగేట్రం మ్యాచ్‌లో సత్తా చాటాడు. కేవలం 15 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రచిన్ 3 ఫోర్లు, సిక్సర్లు బాదాడు. కాగా, రహానే 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 22 పరుగులు చేసిన తర్వాత కెమెరూన్ గ్రీన్‌కు చిక్కాడు.
11 పరుగుల వ్యవధిలో రహానే, డారిల్ మిచెల్ వికెట్లను కోల్పోయిన చెన్నై ఇన్నింగ్స్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే, రవీంద్ర జడేజా చక్కదిద్దారు. దూబే 28 బంతుల్లో 34 పరుగులు చేయగా, జడేజా 17 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఈ సీజన్‌లో చెన్నైకి మొదటి విజయాన్ని రుచి చూపించారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న RCBకి ఫాఫ్ డు ప్లెసిస్, మరియు విరాట్ కోహ్లి స్థిరమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. 23 బంతుల్లో 35 పరుగులు చేసి డు ప్లెసిస్ అవుటయ్యాడు. కెప్టెన్ ఔట్ అయిన వెంటనే ఆర్సీబీ ఇన్నింగ్స్ దారుణంగా తడబడింది. రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. విరాట్ కోహ్లి కూడా 20 బంతులు ఎదుర్కొని 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. కామెరాన్ గ్రీన్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్ చక్కగా హ్యాండిల్ చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 95 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. కార్తీక్ 26 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేయగా.. అనూజ్ 25 బంతుల్లో 48 పరుగులు చేశాడు. చివరి ఐదు ఓవర్లలో అనూజ్-కార్తీక్ జోడీ 71 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బౌలింగ్‌లో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు వికెట్లు తీశాడు.