వెస్టిండీస్‌, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండవ T20I గురువారం రాత్రి జ‌రిగింది ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. ఇంగ్లండ్ ను ఓడించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

వెస్టిండీస్‌(Westindies), ఇంగ్లండ్(England) జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండవ T20I గురువారం రాత్రి జ‌రిగింది ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. ఇంగ్లండ్ ను ఓడించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. గ్రెనడాలోని సెయింట్ జార్జ్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొద‌ట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 176 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Palyer of the Match).. బ్రెండ‌న్‌ కింగ్(Brendon King) 52 బంతుల్లో 82 పరుగులు చేసి విండీస్ విజ‌యంలో కీల‌క భూమిక పోషించాడు. అతడి ఇన్నింగ్సులో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి.

కింగ్‌కు టాప్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ల నుండి మరింత మద్దతు లభించినట్లయితే విండీస్ మరిన్ని పరుగులు సాధించగలిగేది. ఇన్నింగ్స్ మధ్యలో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(Rovman Powell) 28 బంతుల్లో 50 పరుగులు చేయడంతో కింగ్స్ భుజాలపైన ఉన్న‌ భారం కాస్త దూరం అయింది. పావెల్ మూడు ఫోర్లు , ఐదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.

అనంత‌రం 177 ప‌రుగుల ల‌క్ష్యంతో చేధ‌న‌కు దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టుకు ఆదిలోకే ఎదురుదెబ్బ త‌గిలింది. సారథి జోస్ బట్లర్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అకేల్ హోసేన్ చేతికి చిక్కాడు. అనంత‌రం విల్ జాక్స్(Will Jacks), ఫిల్ సాల్ట్(Phillip Salt) రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఇద్దరు ఆటగాళ్లు తదనంతరం త్వరితగతిన నిష్క్రమించారు. అనంత‌రం శామ్ కుర్రాన్ అద్భుత అర్ధ సెంచరీ (32 బంతుల్లో 50) చేసినప్పటికీ.. అది మ్యాచ్ విన్నింగ్‌గా మార్చలేకపోయాడు.

చివ‌ర్లో మొయిన్ అలీ(Moeen Ali) (13 బంతుల్లో 22*) మెరిసినా అప్ప‌టికే చాలా ఆలస్యం అయింది. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 166/7కి పరిమితం అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మెన్ ఇన్ మెరూన్ 2-0తో ముందంజలో ఉంది. ఇంకా మూడు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. మూడో మ్యాచ్ 16న జ‌రుగుతుంది.

Updated On 14 Dec 2023 9:29 PM GMT
Yagnik

Yagnik

Next Story