Mohammed Shami : సొంత జట్టు కోసం రంగంలోకి దిగనున్న షమీ
చీలమండ శస్త్రచికిత్స తర్వాత ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ.. రంజీ ట్రోఫీలో తన సొంత జట్టు బెంగాల్ కోసం ఆడే అవకాశం ఉంది

చీలమండ శస్త్రచికిత్స తర్వాత ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ.. రంజీ ట్రోఫీలో తన సొంత జట్టు బెంగాల్ కోసం ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత అతడు న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏదో ఇక మ్యాచ్ ఆడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో, అక్టోబర్ 18న బీహార్‌తో.. జరిగే తొలి రెండు రంజీ మ్యాచ్‌లలో ఏదైనా ఒకదానిలో షమీ ఆడనున్నాడని తెలుస్తుంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశాలు చాలా తక్కువ. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ అక్టోబర్ 19 నుంచి బెంగళూరులో ప్రారంభంకానుండగా.. ఆ తర్వాత పూణె (అక్టోబర్ 24), ముంబై (నవంబర్ 1)లో టెస్టులు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు షమీ ఈ మ్యాచ్‌లలో ఒకదానిని ఆడాలని భావిస్తున్నాడు. భారత అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన 34 ఏళ్ల షమీ.. గత ఏడాది నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అతడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌లో చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పంచుకున్న కొన్ని వీడియోలలో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో షమీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. అతను దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే.. దులీప్ ట్రోఫీ నాటికి అతడు ఫిట్‌గా ఉండే అవకాశం లేదని.. సెలక్టర్లు ఎటువంటి రిస్క్‌లు తీసుకోకూడదని సూచించినట్లు తేలింది.
ఆస్ట్రేలియాలో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు (జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్) ఫిట్‌గా ఉంచేందుకు మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తుంది. షమీ ఇప్పటివరకు 64 టెస్టులాడి 229 వికెట్లు తీశాడు. అతడు ఆరుసార్లు ఐదు వికెట్లు తీశాడు.
