బెనోనీలో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 79 పరుగుల తేడాతో ఓడింది. 254 పరుగుల లక్ష్యఛేదనలో
దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఓటమంటే తెలియకుండా ఫైనల్ కు చేరిన భారత జట్టు.. చిత్తుగా ఓడిపోయింది. బెనోనీలో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 79 పరుగుల తేడాతో ఓడింది. 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేస్ అటాక్ భారత్ ను కోలుకోనివ్వకుండా చేసింది. ఆదర్శ్ సింగ్ 47, మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) ఫైనల్లో విఫలం కావడంతో భారత్ ఓటమి పాలైంది. ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా, ఆరవెల్లి అవనీశ్ రావు (0) డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి ఆటగాడు హర్జాస్ సింగ్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హ్యారీ డిక్సన్ 42, కెప్టెన్ హ్యూ వీబ్జెన్ 48, ఒలివర్ పీక్ 46, ర్యాన్ హిక్స్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమీ పాండే 1, ముషీర్ ఖాన్ 1 వికెట్ తీశారు.