✕
Tirumala Bramhostavam : తిరుమల బ్రహోత్సవాలు..కొండంత వెలుగునింపుకున్న సప్తగిరులు
By EhatvPublished on 14 Oct 2023 5:33 AM GMT
వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏదో కొత్తదనం. కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ భూమిపై అవతరించారు. శ్రీవారి అవతరణ రోజున చక్రస్నానం నిర్వహిస్తారు.సరిగ్గా అందుకు తొమ్మిది రోజుల ముందు నుంచి జన్మదిన వేడుకలను సాక్షాత్తు మహా విష్ణువు పుత్రుడైన బ్రహ్మదేవుడు నిర్వహిస్తారు.అందుకే తిరుమల కొండలపై జరిగే ఈ ఉత్సవాలకు బహ్మోత్సవాలని పేరు వచ్చింది.

x
Tirumala Bramhostavam
-
- వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏదో కొత్తదనం. కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ భూమిపై అవతరించారు. శ్రీవారి అవతరణ రోజున చక్రస్నానం నిర్వహిస్తారు.సరిగ్గా అందుకు తొమ్మిది రోజుల ముందు నుంచి జన్మదిన వేడుకలను సాక్షాత్తు మహా విష్ణువు పుత్రుడైన బ్రహ్మదేవుడు నిర్వహిస్తారు.అందుకే తిరుమల కొండలపై జరిగే ఈ ఉత్సవాలకు బహ్మోత్సవాలని పేరు వచ్చింది. కొండలంత వరాలను గుప్పించే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులే కాదు,సమస్త లోకమూ సిద్ధమైంది.నానా దిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి అంటూ అన్నమయ్య(Annamayya) వర్ణించినట్టుగానే అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఉత్సవాలను దర్శించి తరించడానికి తండోపతండాలుగా వస్తారు.వేంకటేశ్వరుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు కనులారా తిలకించి, భక్తి పారవశ్యంతో పునీతులవుతారు. తిరుమలేశుడి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారు.
-
- బ్రహ్మ కడిగిన పాదమది. బ్రహ్మము తానైన పాదమది. ఆ పాదమే కాదు, ఆపాదమస్తకమూ అద్భుతమే. ఆ జగదేకమోహనుడి దివ్య స్వరూపాన్ని చూసేందుకు వేయికళ్లయినా చాలవు. ఆ మంగళమూర్తిని ఎంత సేపు చూసినా తనివి తీరదు. జగదానందకారకుడైన వేంకటేశుడు నయనానందకరంగా వుంటాడు కాబట్టే అనునిత్యమూ తిరుమల భక్తులతో పోటెత్తుతుంటుంది. తిరుమల ఆలయంలో నిత్యకళ్యాణము-పచ్చతోరణమే.ఎప్పుడూ పండుగ వాతావరణమే...ఇక బ్రహ్మోత్సవాలప్పుడు వేరే చెప్పాలా? ఏడుకొండలూ కొండంత వెలుగు నింపుకుంటాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత వుంది. శేషాచలంలో వెలిసిన ఆది దేవుడికి మొదటిసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బ్రహ్మోత్సవాలను జరిపించినట్టు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కాబట్టే ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి. మరో పురాణ కథనం ప్రకారం నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు తొమ్మది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయట! అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి ఎలాంటి సంబంధం లేదనీ మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మండంగా జరుగుతాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో కథనం. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మాత్రం సత్యం.
-
- తొమ్మిది రోజుల పాటు దివ్య మందహాసుడి బ్రహ్మోత్సవాలు దివ్య మందహాసుడి బ్రహ్మోత్సవాలు తొమ్మది రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభరోజుకి ముందు రోజు కానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు లేదా తొమ్మది రోజుల ముందుకానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడానికి స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలో నైరుతి దిశలో వున్న వసంతమండపానికి వస్తాడు. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని రాసి,ఆ ఆకారంలో లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తాడు. దీన్నే మృత్ సంగ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మది పాళికలలో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవ ధాన్యాలను పోసి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతిగా వుంటాడు. శుక్లపక్ష చంద్రుడిలా పాళికలలోని నవ ధాన్యాలు కూడా దిన దినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు.అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణ కుంభ ప్రతిష్ట జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు రోజు నీళ్లు పోసి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టే ఇది అంకురార్పణ అయింది.బ్రహ్మోత్సవం తొమ్మిదిరోజుల కన్నులపండుగ. స్వామివారి అలంకరణనుంచి ఊరేగే వాహనం వరకు ఏరోజు ఏది చేయాలో, ఏ అలంకారం ఎలా జరగాలో నిర్దిష్టంగా జరుగుతుంది. ఆగమశాస్త్రాల ప్రకారం పూర్తి శాస్త్రోక్తంగా శ్రీవారి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ విధివిధానాలన్నీ విస్పష్టంగా తెలిసినవారెందరో ఉన్నారు. శ్రీవారి సేవకులు మాత్రమే కాదు. భక్తులు కూడా ఎందరో ఈ సంప్రదాయ విధానంలో స్వామివారిని ఆరాధిస్తారు. కాలానుగుణంగా వాహనసేవల్లో వాటి క్రమంలో జరిగిన కొన్ని మార్పులు తప్ప అలనాటినుంచి నేటివరకూ బ్రహ్మోత్సవాలు ఒకేరీతిలో ఎంతో సంప్రదాయబద్ధంగా జరుగుతూ వస్తున్నాయి.
-
- మొదటి రోజు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు జరిగే ఉత్సవం ధ్వజారోహణం.ఎప్పటిలాగే ఆరోజు ఉదయం కూడా స్వామివారికి సుప్రభాత సేవ తోమాల సేవ జరుగుతాయి. ఆ తరవాత శ్రీదేవీభూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన సేవ చేస్తారు. ఆ తరవాత నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారి వాహనమైన గరుడుణ్ణి ఓ నూతన వస్త్రం మీద చిత్రించి, దాన్ని పతాకంలా ఎగురవేస్తారు. ముందుగా ఈ గరుడధ్వజ పటాన్ని ఊరేగిస్తారు. ఉత్సవమూర్తులైన భోగశ్రీనివాస, శ్రీదేవీ భూదేవీల సమక్షంలో దీన్ని ధ్వజస్తంభం మీదకి చేరుస్తారు. మీన లగ్న సమయంలో దీన్ని ఎగురవేస్తారు. ఆలయప్రాంగణంలో ఉన్న ధ్వజస్థంభం మీద శ్రీవారి విజయకేతనంగా ఈ ధ్వజం రెపరెపలాడుతుంది. ఈ పతాకాన్ని ఎగురవేయడంలో ఓ పరమార్థం ఉంది. ధ్వజారోహణం అన్నది ఓ ఆహ్వానం అన్నమాట! అష్టదిక్పాలకులకీ ముక్కోటి దేవతలకీ ముల్లోకాల్లోని యక్ష రాక్షస గంధర్వగణాలకీ ఇది ఓ ఆహ్వాన పత్రంలా భావించబడుతుంది. ఇలా సంప్రదాయ బద్ధంగా ఆహ్వానిస్తే సకల లోకవాసులూ శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకల్ని తిలకించడానికి వస్తారని విశ్వసిస్తారు. ధ్వజారోహణ వేడుకతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.రెండోరోజు శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలలతో అలంకరిస్తారు. వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనం మీద ఆ ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. తరవాత స్వామివారు, దేవేరులు రంగనాయక మంటపంలో విశ్రమిస్తారు . స్వామి క్షీరసాగరంలో ఆదిశేషుడిపై పవళించే ఆదినారాయణుడే శ్రీనివాసుడయ్యాడు. కలియుగంలో ఆయన కొలువైన కొండ పేరు కూడా శేషాద్రే! అందుకే పెద్ద శేషవాహనంమీద స్వామివారి ఊరేగింపుకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఈ ఊరేగింపు విషయంలో గతానికీ ఇప్పటికీ ఓ చిన్న మార్పు జరిగింది. ఈ ఏడు తలలుండే పెద్ద శేషవాహనాన్ని గతంలో బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదోరోజు ఉదయంపూట ఊరేగింపుకు వాడేవారు.
-
- brahmకానీ ఇప్పుడు ఆ వాహన సేవ మొదటిరోజుకి మార్పు చేశారు. ఇతరవాహనసేవల విషయంలో కూడా గతానికీ ఇప్పటికీ కొన్ని మార్పులు జరిగాయి. గతంలో బ్రహ్మోత్సవాల్లో రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఊరేగింపు కోసం ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడా రోజుల్లో కూడా వాహనసేవ జరుగుతోంది. బ్రహ్మోత్సవాల రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనం అంటే ఆదిశేషుడన్న మాట! మరి చిన్న శేషవాహనం ఏమిటీ అంటే అది 'వాసుకి'కి ప్రతీకగా భావిస్తారు. బ్రహ్మోత్సవంలో రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద ఊరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామిని విద్యాలక్ష్మీ రూపంగా ఆరాధిస్తారు.మూడోరోజు ఉదయం జరిగే వాహన సేవ సింహ వాహనంతో జరుగుతుంది. ఒక్కో వాహనంమీద స్వామికి ఒక్కోరకమైన అలంకరణ ఉంటుంది. సింహవాహనాన్ని ఆధిరోహించిన సమయంలో శ్రీవారు వజ్రఖచితమైన కిరీటాన్ని ధరిస్తారు. జంతువులకి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీక అని చెప్పచ్చు. ప్రతి మనిషిలోనూ మానవత్వంతో బాటు ఇటు మృగత్వం, అటు దైవత్వం కూడా ఉంటాయి. మనిషి తనలోని మృగత్వాన్ని జయిస్తే దైవత్వాన్ని అందుకుంటాడు. మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకుంటే దేవతలనే మించిపోతాడు. మనిషి తనలోని మృగత్వాన్ని జయించేందుకు స్ఫూర్తిగా , ఆ ఉన్నతాదర్శాన్ని గుర్తు చేసేందుకే స్వామివారు సింహవాహనం మీద ఊరేగుతారని భక్తులంటారు.మూడో రోజు రాత్రి స్వామివారు తన ఇద్దరు దేవేరులతో కలిసి భోగశ్రీనివాసుడిగా ముత్యాలపందిరి వాహనం మీద ఊరేగుతారు.ostav
-
- శ్రీవారి వాహన విశేషాలు మహావిష్ణువు అవతారాలు ఎన్నో! శ్రీవారి అలంకారాలూ ఇంకెన్నో! వాహనవిశేషాలూ మరెన్నో! ఆరాధన విధానాలూ ఎన్నెన్నో! ఆకారాలు ఎన్నయినా , అలంకారాల్లో ఎన్ని వైవిధ్యాలున్నా అందరివాడైన శ్రీనివాసుడు ఒక్కడే! భక్తుల గుండెల్లో ఆయనపట్ల వెల్లివెరిసే భక్తి ఒక్కటే! ఉన్నది ఒక్కడే అయినా ఆయన్ను వివిధ రకాలుగా సేవించుకోవడంలో ఏదో విశేషం ఉంది. దివ్యమైన వినోదం ఉంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకుని తీరాలి. తీరని కోర్కెలను ఆయనతో మొరపెట్టుకోవాలి. నారాయణుడి లీలలు నవరస భరితాలు. ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే. బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే. నాలుగో రోజు ఉదయం స్వామి వారు తన కల్ప వృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చేది కూడా ఇందుకే! కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం..పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది.. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారమే...కోరినంత వరాలను గుప్పించే దేవుడే.అదే రోజు సాయంత్రం సర్వ భూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు. భక్తులకు కనువిందుచేస్తారు. అయిదో రోజున స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత వుంది.మిగిలిన అన్ని వాహన సేవలు స్వామి వారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది.
-
- మోహినీ అవతారంలో వున్న స్వామి వజ్రవైఢూర్యాలు పొదిగిన హారాన్ని ధరించి..కుడి చేతిలో చిలుకను పట్టుకుని వుంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవల్లి పుత్తూరు అండాళ్ నుంచి తెచ్చారట! స్వామివారు ఎక్కడికి వెళ్లినా గరుడ వాహనంపైనే వెళతారు.ఖగరాజు ఆయన ప్రధాన వాహనం. అందుకే ఆ పక్షీంద్రుడిని పెరియ తిరువాడి అంటారు. అంటే ప్రధాన భక్తుడన్నమాట. అయిదో రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఓ ప్రత్యేకత వుంది. ఏడాదిలో అన్ని రోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపచేస్తారు. అలాగే ఆ రోజునే శ్రీవారి ఆలయానికి ఎదురుగా వున్న బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామి వారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు వుండరు. ఆ రోజు ఉదయం హనుమద్వాహనసేవ జరుగుతుంది. హనుమంతుడు శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలను అందించిన ఆ భక్తుడిని శ్రీవారు మర్చిపోతారా? అందుకే ఆ బంటుకు మళ్లీ తన సేవా భాగ్యాన్ని అందించింది. ఆ దివ్య దృశ్యాన్ని చూడాలే తప్ప వర్ణించడం వీలు కాదు.. అంతే కాదు. తాను కూడా ఆ మహా విష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియచెప్పే మధురమైన సన్నివేశమది..
-
- ఆరవ రోజు రాత్రి స్వామివారు గజ వాహనం మీద తిరు వీధులలో మెరుస్తారు, భక్తులను మురిపిస్తారు, మైమరపిస్తారు. మహాభాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపించచేస్తూ సాగే ఊరేగింపు ఇది. ఆపదలో వున్న భక్తులను ఆదుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే వుంటానని చెప్పే సన్నివేశం. భక్తుల మొరలను వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచే దృశ్యం. ఏడో రోజు ఉదయం మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. అంటే దివారాత్రాలకు ఆయనే అధిపతి అన్న మాట.చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలుగా వున్న తెలుగు వస్తాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఎనిమిదో రోజున రథోత్సవం జరుగుతుంది.ఇదే రోజున భక్తులు వెల్లువెత్తుతారు. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ ఇదొక్కటే మరి! రథ సారథి దారుకుడు, సైబ్యం, సుగ్రీవం, మేఘ పుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాల పేర్లు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపచేస్తారు. రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే.. అనేది శృతి వాక్యం. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మదో రోజు స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు.
-
- ముందుగా వరాహస్వామి ఆలయ అవరణలో శ్రీదేవి..భూదేవితో సహా అభిషేక సేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే చక్రస్నాన ఉత్సవం. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయం ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్టే బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్టు.పెద్దల అమావాస్య అని, పితృ అమావాస్య, పెత్తరమాస, మహాలయ అమావాస్య అని పిలుస్తుంటారు. కాలంతో పరుగెత్తడం అలవాటయ్యాక తిథులను గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టమే! అందుకే అందరూ ఈ రోజు తమ పెద్దలకు, పితృదేవులకు పండుగ చేస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు.

Ehatv
Next Story