అదో అనిర్వచనీయమైన ఉత్సవం. సామూహిక సంబరం. మహానదిలా వెల్లువెత్తే భక్తి తరంగం. మదిమదిలో ఆధ్యాత్మికభావం. అణువణువునా ఉత్సాహం. అదే మహా రథోత్సవం. జగన్నాథ రథోత్సవం. ఆషాఢ శుద్ధ విదియ రోజున జరిగే అపురూప సన్నివేశం. మంగళవారం సర్వ శోభితంగా జరిగే రథయాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం! సోదరుడు బలభద్రుడు.. సోదరి సుభద్రలతో కొలువైన జగన్నాథుడి కోవెల! ఏడాదికోమారు గుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే అరుదైన సందర్భానికి సమయం ఆసన్నమయ్యింది. ఈ నెల 20వ తేదీన జరిగే ఊరిగింపు కోసం పూరీ క్షేత్రం సర్వసన్నద్ధమయ్యింది. కొత్త రథాలు ముస్తాబయ్యాయి.. ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. పూరీ ఆలయం మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ మూల విరాట్టులు ఏటా కొత్త రథంలోనే ఊరేగుతారు. అందుకే జగన్నాథ రథయాత్ర అపురూమయ్యింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం భక్తులసందోహంతో కళకళలాడుతుంటుంది. వీధులన్నీ జగన్నాథుడి నామస్మరణతో మారుమోగుతుంటాయి. భక్తులకు అది గొప్ప పర్వదినం..

Updated On 19 Jun 2023 11:23 PM GMT
Ehatv

Ehatv

Next Story