✕
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. స్త్రీ మూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటన కుంకుమ బొట్టవుతుంది. బోనం నెత్తిన కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇదో సంస్కృతిక సంబరం. కాంక్రీటు జంగిల్‌గా మారిన నాగరిక నగరం తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోయే అరుదైన సందర్భం.

x
Ashadham Bonalu
-
- ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. స్త్రీ మూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటన కుంకుమ బొట్టవుతుంది. బోనం నెత్తిన కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇదో సంస్కృతిక సంబరం. కాంక్రీటు జంగిల్‌గా మారిన నాగరిక నగరం తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోయే అరుదైన సందర్భం. మాసమంతా పల్లె పడుచు అందాన్ని సంతరించుకునే దృశ్యం. ఆనందంతో గంతులేసే సన్నివేశం.ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే అమ్మలగన్నయమ్మకు బోనాలు సమర్పించడం. బోనం అంటే భోజనం. ఆ నైవేద్యాన్ని స్వీకరించిన అమ్మవారు ఆశీస్సులిస్తుంది.
-
- అనురాగం కురిపిస్తుంది. ప్రజలందరిని చల్లగా చూస్తుంది. బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా వుండాలని కోరుకునే నిస్వార్థపు పండుగదినం. అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన ఆనందపు వెల్లువ. అంతకు మించిన జాతర. కులమతాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునేవే బోనాలు. గోలకొండ కోటలో వెలిసిన జగదాంబకు బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి.. ఆషాడ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయి. తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా, ఏ వేడుకలోనైనా పల్లె వాసన గుబాళిస్తుంది. పల్లెతనం అంతటా వ్యాపిస్తుంది. అణువణువునూ స్పృశించి ఆనందపరుస్తుంది.
-
- ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ పండగైనా పల్లెతో పంట పొలాలతో ప్రకృతితో మమేకమైనవే! రుతువులు మారిన కొద్ది వాతావరణం మారుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి దరిచేరకుండా వుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. చల్లగా చూమని బోనం సమర్పించుకుంటారు. అంతే కాదు ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది కూడా ఇప్పుడే. వర్షాలు బాగా కురవాలనీ, పంటలు బాగా పండాలని ప్రకృతికి అధిదేవతైన అమ్మను వేడుకుంటారు. కాకతీయుల ఆధీనంలో గోలకొండ వున్నప్పట్నుంచే బోనాల సంబరాలు జరుగుతున్నాయనేది చారిత్రక సత్యం. ఆ తర్వాత గోలకొండను జయించి అధికారాన్ని చేపట్టిన కుతుబ్ షాహీలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. నెల రోజుల పాటు అధికారికంగా అంగరంగ వైభవంగా బోనాలు జరిపించేవారు. తానీషా ఆస్థానంలో మంత్రులైన అక్కన్న-మాదన్నల ఆధ్వర్యంలో గోల్కోండ కోట నుంచి షాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు జరిగేవి.
-
- అసఫ్జాహీలు కూడా బోనాలను నిర్వహించారు. లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢమాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలివెళ్తారు. భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్ పాతబస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. హైదరాబాద్ వాడల్లో, వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్లన్నీ కొత్త హంగులు దిద్దుకుంటాయి. కొత్త శోభను అద్దుకుంటాయి. విద్యుద్దీపాలతో ధగధగమనిమెరుస్తాయి.. కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటారు. పట్టు వస్త్రాలు. పసుపుకుంకుమలను ఇచ్చి మొక్కకుంటారు. ఆషాఢంలో అత్తా అల్లుళ్లు ఒకే గడప దాటకూడదనేది శాస్ర్తం.
-
- కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే సంబరాలను తెచ్చే మాసం.. అమ్మకు బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్లు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు. తొట్టెల తీసుకువెళతారు. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్టించి పోలేరమ్మగా, కట్టమైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర వుంది. ఒకప్పుడు పల్లెగా వున్న హైదరాబాద్ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపు దిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. మూలల్ని మరవకపోవడమంటే ఇదే!

Ehatv
Next Story