ప్రతి ఒక్కరు చదవండి చదివి కాస్త ఆలోచించండి...
ఒక దేశపు రాజ్యాంగం అమలులోకి వచ్చిన (ప్రారంభమైన) రోజున ఆ దేశాన్ని "గణతంత్ర దేశం"గా ప్రకటించుకుని.., ఆ దేశ ప్రజలంతా కలిసి జరుపుకునే అతిపెద్ద "జాతీయ పండుగ" దినమే... గణతంత్ర దినోత్సవం (Republic Day).
మరి మన భారతదేశం ఎప్పటి నుండి ఈ గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) జరుపుకుంటోంది..?
బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి 1950 నుండి మన భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) ను జాతీయ పండుగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ రోజు (26 జనవరి 1950)న బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి.., భారతదేశం "సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం"గా అవతరించింది.
మరి భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది..?
మన భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యము వచ్చింది.మన భారత దేశానికి రాజ్యాంగం రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాగా.., బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. భారత రాజ్యాంగం రూపొందించడానికి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాత్రి పగలు ఎంతో శ్రమించి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంలో భారత రాజ్యాంగం రూపొందించారు. అనేక మార్పు చేర్పుల అనంతరం 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.మన రాజ్యాంగం ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో పరిణామ దశ పూర్తయింది.
1930 జనవరి 26 న "పూర్ణ స్వరాజ్"కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావటంతో 26 జనవరిని ఎంపిక చేశారు. ఆ విదంగా 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో మనం ప్రతి సంవత్సరం జనవరి 26 ను మన జాతీయ పండుగగా గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)గా జరుపుకుంటున్నాము.
భారతదేశ ప్రజలుగా మనం ప్రతి సంవత్సరం రెండు జాతీయ పండుగలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం..! మరి జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవం (Republic Day)కి.., ఆగస్టు 15న జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)కి తేడా ఏమిటి..?
ఆగష్టు 15న జరుపుకునే "ఇండిపెండెన్స్ డే" అంటే... భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజున గతాన్ని తలుచుకుంటూ.., స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే దినం.
జనవరి 26న జరుపుకునే "రిపబ్లిక్ డే" అంటే... స్వాతంత్య్రం వచ్చాక మనకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యాంగాన్ని (కాన్‌స్టిట్యూషన్) రూపొందించుకుని., దాన్ని అమల్లోకి తెచ్చుకున్న దినం. అనగా మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించిన రోజు అన్నమాట.
వర్తమానంలో మనం ఏమిటి..? భవిష్యతుల్లో మనం ఏమిటి..? అనే విషయాలను ఆ రోజు బేరీజు వేసుకుంటూ... ఆధునిక భారతదేశ శిల్పకారుడు.., రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారిని స్మరించుకుంటూ.., వారి సేవలను గౌరవించుకునే దినం.
భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడానికి 9 డిసెంబరు 1946న రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అయ్యింది.
బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు 29 ఆగష్టు 1947న రాజ్యాంగ ముసాయిదా (DRAFTING) కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది.
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
గోపాల కృష్ణ గోఖలే గారు 1914లో మొదటిసారి భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం.ఎన్.రాయ్ గారు రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవశ్యకత తెలియజేశారు.
1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది.1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్టులో ఎన్నికలు పూర్తికాగా కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ ౩న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు మిగిలినవి.
ఇంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత రాజ్యాంగ పరిషత్ రూపకల్పనలో నిరుపమాన ప్రతిభా పాటవాన్నీ కఠోర శ్రమను దారబోసిన డాక్టర్ అంబెడ్కర్ గారిని స్మరించుకోవడం భారతీయులు గా మన భాద్యత.
గతం గతః..!
అయ్యిందేదో అయిపోయింది..!!
ఇక నుండైనా జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకలో భారత రాజ్యాంగం రూపొందించి ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన అపూర్వ శిల్పకారుడు బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారి చిత్రం పటాన్ని మాత్రమే ఉంచి ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఆయనకు సముచిత గౌరవం దక్కేందుకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను.
జై హింద్
నా భారతీయులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు