రంజాన్ యొక్క ఉపవాసం ఎలా ఉండాలి ? ఎలా విరమించాలి ?

ముస్లిం పండిత వర్గంలో ఏ కొద్ది శాతం మందో తప్ప అధిక శాతం మంది ముస్లిమేతరులకు వాళ్లకు అర్థమయ్యే భాషలో ఇస్లాం వాస్తవ దృక్పథాన్ని చేరవెయ్యకపోవటం వల్ల, ఇస్లాం సనాతన ధర్మం అన్న విషయాన్ని అవగాహన పరచకపోవటం వల్ల చాలా మంది ముస్లిమేతరుల్లోనే కాక కొందరు ముస్లిముల్లో సైతం ఉన్న అపోహ ఏమిటంటే “రమజాన్ నెల రోజుల ఉపవాస ప్రక్రియ”.. కేవలం ముస్లిముల తాలూకు ఆరాధనా విధానం అన్నది.నిజానికి నెల రోజుల ఉపవాస ప్రార్ధనా విధానం ప్రవక్త ముహమ్మద్(స) తో ప్రారంభమయిన మొట్టమొదటి ప్రక్రియ ఎంతమాత్రం కాదు! కానీ, పూర్వం గతించిన రుషులు, మహనీయులైన ప్రవక్తల నుండి పరంపరగా కొనసాగుతూ వస్తున్న “సనాతన ఆరాధనా విధానం”. ఈ విషయాన్ని స్వయంగా ఖురానే ప్రకటిస్తుంది.

ఉపవాసం - పరంపరగా వస్తున్న ఆరాధనా ప్రక్రియ!

విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడిందో..

గత చరిత్ర తాలూకు పేజీలు కాస్త తిరగేస్తే.. ఖురాన్ కు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ పాతనిబంధనలో ఉపవాసం గురించి దాని మౌలిక లక్ష్యం గురించి ఈ క్రింది విధంగా ప్రస్తావించటం జరిగింది.

“దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడినవారిని

విడిపించుటయు ప్రతీకాడిని విరగ్గొట్టుటయు నే నేర్పర్చుకొనిన ఉపవాసం కాదా?” – యెషయా 58:6

అచ్చం ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఒక హదీసులో – ఉపవాస లక్ష్యం అన్న పానీయాలు విడనాడటం కాదు, అబద్ధాన్ని విడనాడటం చెడు పనులు చెయ్యకపోవటం దుర్భాషలాడకపోవటం అని చెప్పటం జరిగింది.

అలాగే ఖురాన్ లో ఉపవాసాన్ని “సౌం” అని పేర్కొనటం జరిగింది. సౌం అంటే.. “నిలిపివేయుట” “నిలిచిపోవుట” అన్న అర్థాలు వస్తాయి.అంటే మనస్సులో మెదిలే చెడు ఆలోచనలు, చెడు తలంపులు తలెత్తకుండా, కళ్లూ, కాళ్లూ, చేతులూ చెడు పనులకు పాల్పడకుండా, నోటిని చెడు మాటలు మాట్లాడకుండా నిలిపి వేయటం. అందుకే ఉపవాసాన్ని “సౌం” అని పేర్కొనటం జరిగింది.

“ఉపవాసం అన్నది ఒక్క ఉదరంలో భోజన పానీయాలను దిగకుండా ఆపటమే కాదు, మనస్సులో చెడు తలంపులు దిగకుండా ఆపటమే అసలు ఉపవాస లక్ష్యం”. ఇది రానున్న పదకొండు నెలల్లో ప్రతిబింబించాలి.

దేవుని కోసం యేసు ఉపవాసమున్నారు!

స్వయంగా యేసునే దేవుడని అపార్థం చేసుకునే క్రైస్తవులు గమనించాల్సింది స్వయంగా యేసు, నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించటమే కాక (మత్తయి 4:2), తన అనుచరులను సైతం దేవుని కోసం ఉపవాసం ఉండాల్సిందిగా ఆజ్ఞాపించటమైంది.

“ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న తండ్రికే కనపడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము” – మత్తయి 6:17

అలాగే గీతాశాస్త్రంలో ఈ “ఉపవాస దీక్ష” “తపోయజ్ఞము” అని ప్రస్తావించటం జరిగింది (గీతా 4:28) అంటే- “వ్రత ఉపవాసాదులచే దేహమును తపింపచేసి స్వాధీనపరచుట” అని అర్థం.

"ఉప" అంటే- "సమీపముగా" "వాసము" అనగా నివసించుట.

"ఉపవాసము" అంటే "దేవునికి దగ్గరగా నివసించుట" అని అర్థం. హైందవ సంస్కృతిలో గమనిస్తే.. కార్తీకమాసంలో పూర్తి నెల ఉపవాసాలు పాటించే విధానాన్ని గమనించగలం.

ముఖ్యంగా అసలు రమజాన్ నెలకు ఇంత ప్రాధాన్యత దేనికి? అంటే.. “రమజాన్ నెల ఖురాన్ గ్రంథం అవతరించిన నెల (2:185)” కావటమే!

అలాగే చాంద్రమాన పంచాంగం (Lunar Calander) ప్రకారం “రమజాన్” అన్నది 9 వ మాసం పేరు. ప్రవక్త ముహమ్మద్ (స) పూర్వం అవతరించిన గ్రంథాలన్నీ 9 వ మాసంలోనే అవతరించాయని ఒక హదీసులో పేర్కొనటం జరిగింది.

చివరకు హిందూ పండితుల ప్రకారం భగవద్గీతా శాస్త్రం సైతం చాంద్రమాన పంచాంగం 9 వ నెల అయిన శుద్ధ మార్గశిర మాసంలోనే అవతరించిందని తెలియజేశారు.

ఇప్పటికీ ప్రతీ సంవత్సరం నిర్వహించే “గీతా జయంతి” ఉత్సవాలు శుద్ధ మార్గశిర మాసంలోనే జరుపుతుంటారు. అది చాంద్రమాన క్యాలండర్ ప్రకారం 9 వ నెల ఈ విధంగా పూర్వ గ్రంథాలూ, ఖురాన్ అవతరించిన 9 వ నెల అయిన “రంజాన్” కు ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉంది.

అందుకే, ఈ పూర్తి నెలలో సృష్టికర్త అయిన దేవుడు “ఏ విధంగా పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి ఉపవాసాన్ని విధి చేశాడో, అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులకు కూడా ఆ “సనాతన ఉపవాస దీక్ష”ను తిరిగి పాటించాల్సిందిగా ఆదేశించటం జరిగింది (2:183)”

ఉపవాస లక్ష్యం!

ఇక ఈ పూర్తి నెలలో ఉపవాసం పాటించమనటం వెనుక ప్రధాన లక్ష్యం “భయభక్తులు జనించటానికి (2:183)” అని ఖురాన్ తెలుపుతుంది. విశ్వాసి తన ప్రవర్తనలో నైతికపరమైన మార్పు తీసుకురాకుండా ఎంత దీక్షగా నెలరోజులు ఉపవాసాలు పూర్తి చేసినప్పటికీ అది కేవలం పస్తులుండటంతో సమానమవుతుంది.

ehatv

ehatv

Next Story