వారిద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. గాఢంగా ప్రేమించుకున్నారు.
వారిద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రోజే గొడవ పడ్డారు. ఎందుకు గొడవపడ్డారో తెలియదు కానీ వేట కొడవళ్లతో ఒకరినొకరు నరుక్కుని చనిపోయారు. కర్నాటకలోని(Karnataka) కోలారు జిల్లా కేజీఎఫ్(KGF) పట్టణంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు 19 ఏళ్ల లిఖితశ్రీ అనే కూతురు ఉంది. ఆమె చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఉన్న సంతూరు నివాసి మునియప్ప కొడుకు నవీన్‌కుమార్‌ను (27)ను ప్రేమించింది. అతడు కూడా ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించాడు. లిఖిత ఇంటర్ చదివింది. నవీన్‌కుమార్ బట్టల షాపు పెట్టుకున్నాడు. పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పడే ఇద్దరికి గొడవ అయ్యింది. గట్టిగా అరచుకున్నారు. ఏం జరిగిందో చూద్దామని బంధువులు తలుపులు తెరచి చూశారు. ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానిస్తున్నారు. లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కాసేపటికే చనిపోయింది. నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, తర్వాత బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతడు కూడా చనిపోయాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే కొత్త దంపతులు చనిపోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.