అబ్‌కీ బార్ చార్‌సౌ పార్ అంటూ ఎన్నికల గోదాలో దూకిన భారతీయ జనతా పార్టీకి(BJP) నాలుగు వందల సీట్లు కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ వస్తే మహా ఎక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాన్య ప్రజలు, సెఫాలజిస్ట్‌లు, ఆర్ధిక నిపుణులు అందరూ ఈ మాటే అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల క్రతువులో ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ ముగిసింది. ఈ నాలుగు దశల్లోనూ బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు.
అబ్‌కీ బార్ చార్‌సౌ పార్ అంటూ ఎన్నికల గోదాలో దూకిన భారతీయ జనతా పార్టీకి(BJP) నాలుగు వందల సీట్లు కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ వస్తే మహా ఎక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాన్య ప్రజలు, సెఫాలజిస్ట్‌లు, ఆర్ధిక నిపుణులు అందరూ ఈ మాటే అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల క్రతువులో ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ ముగిసింది. ఈ నాలుగు దశల్లోనూ బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు. పైగా ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదయ్యింది. ఇదే బీజేపీ అధినాయకత్వాన్ని భయపెడుతున్నది. ఎన్టీయే(NDA) విజయం అంత ఈజీ కాదని ప్రధానమంత్రి మోదీకి(PM Narendra Modi) కూడా తెలిసిపోయింది. అందుకే హిందూ-ముస్లిం ఎజెండా ఎత్తుకున్నారు. విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలను ఉన్నట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్(Congress) వస్తే రామమందిరానికి(Ram Mandir) తాళం వేస్తారని చెబుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్ని చేస్తున్నా బీజేపీకి పెద్దగా మైలేజీ రావడం లేదు. ఉత్తరాదిలో ఎక్కువ సీట్లను గెల్చుకునే బీజేపీకి ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందుకు కారణం మోదీ గ్రాఫ్ బాగా పడిపోవడమే. రెండు మూడు నెలల కిందటి వరకు మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని, బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని మార్కెట్ వర్గాలు అనుకున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ వర్గాల ఆలోచనలో మార్పు వచ్చింది. నాలుగు దశల ఎన్నికలలో(ELection) ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. దాని ప్రభావం మార్కెట్‌పై పడింది. అందుకే పాతిక రోజుల వ్యవధిలోనే సెన్సెక్స్ 2,500 పాయింట్ల వరకు కోల్పోయింది. సుమారు పాతిక లక్షల కోట్ల రూపాయల ముదుపర్ల సంపద పోయింది. ఇండియా వొలటాలిటీ ఇండెక్స్ అంటే వీఐఎక్స్. ఇది భారత స్టాక్ మార్కెట్లలో అస్థిరతను సూచిస్తుంది. ఈ సూచిక గత తొమ్మిది సెషన్లలో ఏకంగా 67 శాతం పెరిగి 21.88 శాతానికి చేరుకుంది. అంటే మార్కెట్లలో అస్థిరత్వం ఎక్కువగా ఉందని వీఐఎక్స్ చెబుతున్నది. బీజేపీకి ఈఎన్నికల్లో సీట్లు తగ్గబోతున్నాయనడానికి ఇదో సంకేతం!
సాధారణంగా నరేంద్రమోదీ ఉన్న చోట మిగతావారికి ప్రాధాన్యం ఉండదు.
ఫోటోలలో కూడా మోదీనే హైలైట్ అవుతారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు తను ఒక్కడే అందరికీ కనిపించాలనుకుంటారు మోదీ! విజయాలలో తన పాత్రనే ఎక్కువ అని చెప్పుకుంటారు. రోడ్డో, బ్రిడ్జినో మరొకటో ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా అంతే! తను ఒక్కరే కనిపిస్తారు. అయితే వారణాసినుంచి మూడో సారి నామినేషన్ వేసినప్పుడు మోదీ అందరినీ ఆహ్వానించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు. అందరితో కలిసి బలప్రదర్శన చేశారు. చూశారా.. తన వెనుక ఎంత మంది ఉన్నారో అని చెప్పుకోవడానికే ఈ తతంగం అంతా! ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ ప్రజలు తమకు నీరాజనాలు పలికారని మోదీ, అమిత్ షాలు(Amit shah) గొప్పగా చెప్పుకొచ్చారు ఇంతకాలం! కశ్మీర్(Kashmir) మొత్తం మారిపోయిందని అన్నారు. వాస్తవ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. బీజేపీ అంటేనే కశ్మీరు ప్రజలు మండిపోతున్నారు. అందుకే కశ్మీర్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగడానికి బీజేపీ భయపడింది. ఎన్నికల బరిలో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. కశ్మీర్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలలో బీజేపీ పోటీ చేయడం లేదు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అక్కడ పోటీచేయకపోవడమేమిటో! కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు బీజేపీ. పైగా మునుపటి కంటే ఇప్పుడే అక్కడ కశ్మీర్ పండిట్ల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. కశ్మీరీ పండిట్ల హత్యాకాండ కూడా బీజేపీ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఈ భయం కొద్దే అక్కడ పోటీ నుంచి తప్పుకుంది బీజేపీ. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జేఎంఎం నాయకుడు హేమంత్ సొరేన్‌లపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధింపులకు దిగింది మోదీ ప్రభుత్వం. వారిని జైలుకు పంపించి ఆనందపడింది. ఇండియా కూటమిని విచ్ఛినం చేయడానికి ఎంత చేయాలో అంతా చేసింది. తన పాదాక్రాంతులైన ఛానెళ్ల ద్వారా విషాన్ని చిమ్మించింది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈసారి బీజేపీని ఇంటికి పంపించాలని డిసైడయ్యారట! ఈ విషయాన్ని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ చెబుతున్నారు. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయేకు రాదని గట్టిగా చెబుతున్నారు. రామమందిర నినాదం ఈ ఎన్నికల్లో పని చేయడం లేదన్నారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బీజేపీకి 200 సీట్లు దాటబోవని అంచనా వేస్తున్నారు.