ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఈడీ ముందు హాజరవాల్సివుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam Case)లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గురువారం ఈడీ(ED) ముందు హాజరవాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా.. లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై బుధవారం ఓ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానమిస్తూ.. తాను న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నానని.. ఆ అభిప్రాయం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మరోవైపు గురువారం ఆయన గోవా(Goa) వెళ్లనున్నారు. దీంతో ఈడీ ముందు హాజరుకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది.
జనవరి 18న హాజరుకావాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల సమన్లు పంపింది. అయితే ఇప్పటి వరకూ ఆయన హాజరుపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈడీ సమన్లకు సంబంధించి లాయర్ల నుంచి ముఖ్యమంత్రి సలహాలు తీసుకుంటున్నారని చాలా రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదికాకుండా ఆప్ అధిష్టానం గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలకు గానీ ఎటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వలేదు. అందుకే గత మూడు సార్లు మాదిరిగానే ముఖ్యమంత్రి ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
గతంలో వచ్చిన మూడు ఈడీ సమన్ల(Enforcement Directorate Summons)పై ముఖ్యమంత్రి ప్రశ్నలు సంధించారు. ఈడీకి మూడుసార్లు లిఖితపూర్వక సమాధానం పంపారు. సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ సమన్లలో తనకు సమన్లు పంపడానికి గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదని ఆయన మూడు సార్లు చెప్పారు. చివరిసారి కూడా ఈడీకి వ్రాతపూర్వక సమాధానమే ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.