హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. తమకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందని బీజేపీ(BJP) కూడా అనుకోని ఉండదు. కాకపోతే గెలవడానికి చేయాల్సిందంతా చేసింది. ఇందులో భాగంగానే డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(Ram Rahim Singh)కు ఎన్నికల ముందు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌పై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. స్వప్రయోజనాల కోసమే బీజేపీ డేరా బాబా(Dera Baba)కు ఎన్నికల ముందు పెరోల్ ఇచ్చిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా జైలు జీవితం గడుపుతున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు 20 రోజుల పెరోల్ లభించింది. ఆయన జైలు నుంచి బయటకు రావడం బీజేపీకి కలిసివచ్చిందా? ఆయన చెప్పిన మాట ఓటర్లు విన్నారా? నిజానికి డేరా మద్దతుదారులు 28 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. ఇందులో 15 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ(Congress) గెలిచింది. బీజేపీకి 10 స్థానాలే లభించాయి. ఐఎన్ఎల్‌డీ(INLD) రెండు స్థానాలలో గెలిస్తే ఓ చోట ఇండిపెండెంట్ గెలిచారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రస్‌కు 53.57 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 35.71 శాతం ఓట్లే వచ్చాయి. ఐఎన్‌ఎల్‌డీకి 7 శాతం ఓట్లు , స్వతంత్రులకు 3.57 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, డేరా బాబా జైలు నుంచి రావడం వల్ల బీజేపీకి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. హర్యానా ఎన్నికల(Haryana Elections)లో బీజేపీకి ఓటు వేయాలని సత్సంగ కార్యక్రమంలో డేరా బాబా తన అనుచరులను కోరాడు. ప్రతి అనుచరుడు కనీసం అయిదుగురు ఓటర్లను బూత్‌కు తీసుకురావాలని సత్సంగం సందర్భంగా సూచించారు. డేరా బాబా గతంలో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లకు కూడా మద్దతు ప్రకటించారు.
2007 హర్యానా ఎన్నికలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డేరా బాబా బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అయితే 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించారు. ఇప్పుడు కూడా బీజేపీకే సపోర్ట్ చేశారు కానీ వర్క్ అవుటవ్వలేదు.