సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ను కర్ణాటక హైకోర్టు బుధవారం హెచ్చరించింది. రాష్ట్ర పోలీసులకు సహకరించకపోతే భారతదేశం అంతటా ఫేస్‌బుక్ సేవలను బంద్ చేస్తామని కోర్టు పేర్కొంది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయునికి సంబంధించిన కేసు దర్యాప్తుకు సంబంధించి కోర్టు ఈ వ్యాఖ్య చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్(Facebook) ను కర్ణాటక హైకోర్టు(Karnataka Highcourt) బుధవారం హెచ్చరించింది. రాష్ట్ర పోలీసులకు సహకరించకపోతే భారతదేశం అంతటా ఫేస్‌బుక్ సేవలను బంద్ చేస్తామని కోర్టు పేర్కొంది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయునికి సంబంధించిన కేసు దర్యాప్తుకు సంబంధించి కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ఈ విషయంలో కర్ణాటక పోలీసులకు ఫేస్‌బుక్ సహకరించడం లేదని ఆరోపించారు. దక్షిణ కన్నడ జిల్లా(Dakshina Kannada district) బికర్నాకటే నివాసి కవిత(Kavitha) పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్(Justice Krishna S. Dixit) ధర్మాసనం సోషల్ మీడియా సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.
సౌదీ అరేబియా(Saudi Arabia)లో భారతీయ పౌరుడి అరెస్టు అంశంపై ఇప్పటి వరకు మీ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. దీనిపై విచారణ కొనసాగించి నివేదిక ఇవ్వాలని మంగళూరు పోలీసులను ఆదేశించింది.
తన భర్త శైలేష్ కుమార్(Shailesh Kumar) (52) గత 25 ఏళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడని.. తాను మంగళూరు సమీపంలోని తన ఇంట్లో ఉంటున్నానని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ కవిత తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (National Register of Citizens)కి మద్దతుగా 2019లో తన భర్త ఫేస్‌బుక్ పోస్ట్ చేశాడని కవిత చెప్పారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరు మీద నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి సౌదీ అరేబియా, ఇస్లాం పాలకులకు వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఈ విషయం శైలేష్‌కు తెలియడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో భార్య మంగళూరు పోలీసుల(Mangaluru police)కు ఫిర్యాదు చేసింది. అయితే ఇంతలో సౌదీ పోలీసులు శైలేష్‌ను అరెస్ట్(Arrest) చేసి జైల్లో పెట్టారు.
దీనిపై మంగళూరు పోలీసులు విచారణ చేపట్టి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా(Fake Facebook Accounts)లపై సమాచారం కోసం ఫేస్‌బుక్‌ను ఆశ్రయించారు. అయితే పోలీసుల డిమాండ్లపై ఫేస్‌బుక్ స్పందించలేదు. విచారణలో జాప్యంపై పిటిషనర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.