సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar), మహేందర్ సింగ్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఏమైంది? వారి రక్తం ఎందుకు సలసలమని కాగడం లేదు? వారి నోరెందుకు పెగలడం లేదు? దేశంలోని ముప్పాతిక శాతం జనం మహిళా రెజ్లర్ల(Wrestlers) పక్షాన ఉండి, వారిని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే ఈ క్రికెట్ దిగ్గజాలు గమ్మున ఎందుకుంటున్నారు? బీజేపీ(BJP) అంటే భయమా? లేక భక్తా?
సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar), మహేందర్ సింగ్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఏమైంది? వారి రక్తం ఎందుకు సలసలమని కాగడం లేదు? వారి నోరెందుకు పెగలడం లేదు? దేశంలోని ముప్పాతిక శాతం జనం మహిళా రెజ్లర్ల(Wrestlers) పక్షాన ఉండి, వారిని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే ఈ క్రికెట్ దిగ్గజాలు గమ్మున ఎందుకుంటున్నారు? బీజేపీ(BJP) అంటే భయమా? లేక భక్తా? 1983లో ప్రపంచకప్‌ను మనకు అందించిన కపిల్‌దేవ్ బృందం రెజ్లర్లకు మద్దతు పలికినప్పుడైనా అయ్యో మనం తప్పు చేస్తున్నాం అన్న భావన కలగలేదా? 1983 వరల్డ్‌కప్‌ను గెల్చుకున్న టీమిండియాలో యశ్‌పాల్ శర్మ మినహా (ఆయన ఇప్పుడు లేరు. చనిపోయారు) ప్రతి ఒక్క సభ్యుడు రెజ్లర్లకు సపోర్ట్‌గా నిలిచారు. రెజ్లర్లతో పోలీసులు అభ్యంతరకంగా ప్రవర్తించిన దృశ్యాలు తమను ఎంతగానో కలవరపెట్టాయని, ఎంతో శ్రమకోర్చి దేశం కోసం సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోందని కపిల్‌దేవ్ బృందం ఆవేదనతో అంది. ఆ పతకాలను సాధించడం వెనుక ఎంతో కృషి, త్యాగం ఉందని, అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు, వాటిలో ఈ దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉందని కపిల్‌దేవ్ బృందం తెలిపింది. ఇప్పుడున్న క్రికెటర్లు ఎందుకు స్పందించడం లేదు. అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డుకెక్కిన అనిల్ కుంబ్లే సైతం రెజ్లర్లకు బాసటగా నిలిచాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ పదికి పది వికెట్లు తీసుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించిన కుంబ్లే మనసున్న వ్యక్తిగా పదికి పది మార్కులు కొట్టేశారు. మరి భారతరత్న సచిన్‌కు ఏమైంది? తాను రాజకీయాలకు దూరం అని చెప్పుకోవచ్చు.. మరి రాజ్యసభ పదవిని ఎందుకు తీసుకున్నట్టు? మహిళా రెజ్లర్లు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు నిన్ను కదిలించలేదా?
మీకు గుర్తుందా ...? రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్‌బెర్గ్, అమండా సెర్నీ, లిల్లీ సింగ్, మీనా హారిస్, హసన్ మిన్హాజ్, ఇల్హాన్ ఒమర్ ఇలా చాలా మంది విదేశీ ప్రముఖులు వారికి బాసటగా నిలిచారు. ఇలా రైతుల ఆందోళనకు వీరు మద్దతు తెలపడం ఇదే సచిన్ తెందూల్కర్‌కు నచ్చలేదు. ఒక్క సచినే కాదు, అక్షయ్ కుమార్, సునిల్ షెట్టి, అజయ్ దేవగణ్.. వీరంతా గాయ్‌గత్తర చేశారు. ఇది మా అంతర్గత సమస్య, మీరు జోక్యం చేసుకోకూడదు అని హుంకరించారు. మా రైతుల ఆందోళనలతో విదేశీయులకు ఏం పని? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు రెజ్లర్లు చేస్తున్న ఆందోళన ఇక్కడే కదా! వారేమీ విదేశీ గడ్డపై నిరసనలు చేయడం లేదు కదా! ఇప్పుడెందుకు పెడబొబ్బలు పెట్టడం లేదు. అయినా సచిన్ మహాశయుడా? నువ్వు రెజ్లర్ల కంప్లయింట్‌పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను చదివావా? రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల్లో ఒకటి విదేశీ గడ్డపై జరిగిన టోర్నమెంట్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ అనే సచ్చీలుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే! విదేశీ గడ్డపైనే ఇదంతా జరిగింది.
రెజ్లర్లు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు బ్రిజ్ భూషణ్ అక్కడ చొరపడేవాడు. శ్వాసను పరీక్షించే వంకతో అమ్మాయిల ఛాతీని తడిమేవాడు. నడుమును ముట్టుకునేవాడు. సచిన్.. ఇవి నువ్వు చదవలేదా? లేకపోతే ఇవి నీకు చిన్న విషయాలుగా అనిపించాయా? లేక బ్రిజ్‌భూషణ్ మంచివాడు అనే నిర్ధారణకు వచ్చేశావా? సచిన్‌ను, ధోనీని, కోహ్లీని చాలా మంది అభిమానిస్తారు. ఆరాధిస్తారు. ముగ్గురిలో విరాట్ కోహ్లీ అంటే ఇంకొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది అనుకోవడం వల్లే. బౌలర్ షమిపై బీజేపీ మద్దతుదారులు మాటలతో దాడులు చేస్తున్నప్పుడు షమికి సపోర్ట్‌గా నిలిచినవాడు కోహ్లీ ఒక్కడే! ఈ సంఘటన తర్వాత కోహ్లీకి అభిమానులు ఎక్కువయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు 1983 ప్రపంచకప్ విజేతలు రెజ్లర్ల పక్షాన నిలిచారు. సచిన్, ధోనీ, కోహ్లీలకు వెన్నముక లేదనుకోవాలా? సరే వీరిని వదిలేద్దాం.. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రాలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి రెజ్లర్లకు సపోర్ట్ చేశారు. మాట్లాడుతున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గౌరవనీయులైన సచిన్, కోహ్లీ, ధోనీలకు విన్నపమేమిటంటే ఇప్పటికే ఆలస్యమయ్యింది... ఇకనైనా నోరు విప్పండి. మాక్కూడా చిన్నపాటి మనసుందని చాటుకోండి.