హిందూ సంప్రదాయంలో అనేక పండుగలున్నాయి. ఇందులో హనుమాన్ జన్మోత్సవం(Hanuman Janmostavam) కూడా ముఖ్యమైన పండుగ. ఇవాళ హనుమజ్జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఊరూరా, వాడవాడనా యావత్ దేశవ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్ర లంఘించి లంకకు(Lanka) చేరి సీతమ్మవారి(Sita Devi) జాడ కనిపెట్టారు. సంజీవనీ(Sanjivi) పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు నిర్వహిస్తూ వస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా.. మరికొందరు వైశాఖమాసం దశమినాడు అంటే ఈ రోజున హనుమజ్జయంతిని జరుపుకుంటున్నారు. ఇక తమిళనాడు, కేరళ(Kerala) రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి నిర్వహిస్తారు.
హనుమాన్ జీ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు. కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం అని పిలవడం సరైనది. అందుకే చాలా మంది హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా పిలుస్తారు. “అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ” హనుమంతుని మనసార స్మరిస్తే చాలట బుద్ధి, శరీరబలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవ్వరి వలన భయపడకపోవటమూ, ఆరోగ్యము కలుగుట, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం.
“వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుతా- పూర్తప్రోష పదాయుక్తా అధనైదృత సంయుతా తసాం మధ్యాహ్ననే వాయాం జనయా మాస వైసుతమ్” అంటే ఆంజనేయస్వామి వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమి శనివారం, పూర్వాబాధ్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీ నామయోగం గ్రహాలన్నియు శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవి(Anjana devi) ముక్తాఫల గర్భమున జన్మించాడు. ఆనాటి నుండి వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి ని జరుపుకుంటాం. హనుమ మాతృభక్తి పరాయణుడు. మనం ఆ సుగుణాన్ని అలవరచుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు.
పావని ప్రభుభక్తిపరుడు. ప్రభువంటే రాజు, యజమాని. హనుమకి ప్రభువు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు. సీతజాడ కనిపెట్టమని ఆదేశించగా.. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, సీతమ్మ జాడ కనిపెట్టాడు. అటు రామకార్యాన్ని, ఇటు రాజాజ్ఞను నెరవేర్చాడు. ఆ కార్యదీక్షను, ధైర్యసాహసాలను అలవరచుకోవాలి. ఆంజనేయస్వామి- స్వామిభక్తి ప్రపూర్ణుడు. స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరాముడు. తన వినయం, విధేయత, భక్తి, సేవలతో స్వామిని అలరించాడు. ఆంజనేయుడిపట్ల అంత నమ్మకం ఉన్నందునే తన అంగుళీయకాన్ని ఇచ్చి పంపాడు రాముడు. అతడే కార్యసాధకుడన్న మహావిశ్వాసం రాముడిది.
అడుగడుగునా ఎదురైన ఆటంకాలన్నిటినీ అధిగమించాడు. సీతా మహాసాధ్విని కలిసి, ఆనవాలును చూపాడు. ఆ తల్లిని ఓదార్చాడు.తిరిగి రాముని చేరుకుని, ధైర్యం చెప్పి, రావణ సంహారంలో ఎన్నో విధాల సహకరించాడు. సీతారాములను కలిపాడు. అంతేనా! వారిని తన హృదయంలో స్థిరపరచుకున్న భక్తాగ్రేసరుడు అంజనీపుత్రుడు. పరోపకారానికి, లోకశ్రేయస్సుకి మరో రూపం ఆంజనేయుడు. లక్ష్మణుని బతికించడానికి ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. దుష్టసంహారం చేసి, జగత్తుకు ఎనలేని మేలు చేకూర్చాడు. నిత్యం రామనామ స్మరణతో భూలోకాన్నే పునీతం చేశాడు. రామభక్త హనుమంతుని ఆరాధనతో ఇన్ని సద్గుణాలు అలవడతాయి.