బ్రిటిష్ పాలనలో మన దేశం నలిగిపోయింది. మన సంపదను బ్రిటిష్ పాలకులు దోచుకున్నారు.
బ్రిటిష్ పాలనలో మన దేశం నలిగిపోయింది. మన సంపదను బ్రిటిష్ పాలకులు దోచుకున్నారు. మనల్ని అనాగరికులుగా భావించారు. తెల్లదొరల పాలనలో అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కొన ప్రజలు తిరుగుబాటు చేశారు. అనేక మంది సమరయోధులు(Freedom fighters) పోరాటం చేశారు. వారి వల్లనే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం. స్వాతంత్ర్యం మనకు ఒక్కసారిగా లభించలేదు. ఎన్నో ఉద్యమాల అనంతరం మనకు దక్కింది. విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రమం, క్విట్ ఇండియా మూవ్‌మెంట్(Quit India movement) ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! కానీ బ్రిటిష్ వారిని చపాతి ఉద్యమం ఒకటి వణికించిందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అసలేం జరిగిందంటే 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన విషయం తెలిసిందే కదా! దాన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటాం. అదే ఏడాది ప్రారంభంలో చపాతీ ఉద్యమం(Chapathi movement) ఊపందుకుంది. ఎవరు దీనికి ఆద్యులో, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు కానీ దేశంలోని ప్రతి ప్రాంతంలో చపాతీల పంపిణీ ఒక ఉద్యమంలో సాగింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి గ్రామంలోని కాపలాదారుడికి కొన్ని చపాతీలు ఇచ్చి.. వాటిని ఊర్లో పంచమని, మరికొన్ని చపాతీలు చేసి మరికొందరికి పంపిణీ చేయమని చెప్పాడట. ఆ కాపలాదారుడు అలాగే చేయడంతో ఉత్తర భారతదేశంలో మొదలైన ఈ చపాతీల పంపిణీ ఓ ఉద్యమంలా దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటీష్ అధీనంలో ఉండే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి చపాతీలు వెళ్లేవి. 1857 ఫిబ్రవరిలో మొదటిసారి ఈ చపాతీల పంపిణీ గురించి మథురలోని బ్రిటీష్ అధికారి థోర్న్‌హిల్‌కి తెలిసింది. తన ఆఫీసులో చపాతీలను ఓ పోలీసు ఆఫీసర్ తెచ్చిపెట్టడం చూశాడు. వాటిని ఆ ఊరిలో కాపలాదారుడు ఆ పోలీసుకు ఇచ్చాడని తెలుసుకున్నాడు. అతడిలో క్యూరియాసిటీ పెరిగింది. చపాతీల పంపిణీపై ఆరా తీశాడు. అప్పుడు థోర్న్‌హిల్‌కు ఆశ్చర్యం కలిగించే నిజాలు తెలిశాయి. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచుతున్నారని, ఆ చపాతీలు రాత్రికి రాత్రే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలుసుకున్నాడు. దాంతో బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు మొదలయ్యింది. ఏదో జరుగుతోందనే అనుమానం వారికి కలిగింది. చపాతీల పంపిణీతో ఏదో ఉద్యమం మొదలవుతుందని తెల్లదొరలు భావించారు. ఆ రొట్టెల ద్వారా ఏమైనా సందేశాలు పంపుతున్నారేమోనన్న సంశయమూ వారికి కలిగింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. కేవలం చపాతీలే చేతులు మారుతూ ఒక చోట నుంచి మరో చోటుకి వెళుతుండేవి. అసలు ఈ చపాతీల సంగతిని పసిగట్డాలని చాలా మంది బ్రిటిష్ అధికారులు ప్రయత్నించారు. కొందరు చపాతీలు దక్షిణ భారతం నుంచి వస్తున్నాయని, మరొకొందరు కోల్‌కతా నుంచి వస్తున్నాయని చెప్పారు. అయితే దీని మూలాలను మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్లకు ఈ ఉద్యమం కనుమరుగయ్యింది. కానీ దాని ఉద్దేశమేమిటో మాత్రం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. ఒక్కటి మాత్రం నిజం. చపాతీల ఉద్యమం బ్రిటిష్ వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసింది. ఈ ఉద్యమం తర్వాతే సిపాయిల తిరుగుబాటు, ఝాన్సీ లక్ష్మీబాయి (Jhansi Lakshmibai)పోరాటం జరిగాయి. అయితే వీటికి చపాతీల ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అన్నది మిస్టరీగానే ఉంది.