భారతీయ జనతాపార్టీ(BJP) ప్రభ నెమ్మదిగా తగ్గిపోతున్నదని మొన్నటి ఎన్నికల(Election) ఫలితాలే రుజువు చేశాయి

భారతీయ జనతాపార్టీ(BJP) ప్రభ నెమ్మదిగా తగ్గిపోతున్నదని మొన్నటి ఎన్నికల(Election) ఫలితాలే రుజువు చేశాయి. ఉత్తరాదిలో ఆ పార్టీ గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఉత్తరభారతం తమకు కంచుకోట అని ఇంతకాలం అనుకుంటూ వచ్చిన బీజేపీకి సార్వత్రిక ఎన్నికలు షాకిచ్చాయి. బీజేపీ ఎదుగుదలకు దోహదపడిన ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో బీజేపీకి ఎదురుదెబ్బే తగిలింది. 2029లో అధికారాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచనలో కమలదళ నేతలు పడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలలో తమకు ఆదరణ తగ్గితే ఆ లోటును దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసి పూడ్చుకోవాలని అనుకుంటోంది. బీజేపీ ఇప్పుడు కావల్సింది ఇదే! ఇంతకాలం రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి ఉత్తరాదిలో గెలుస్తూ వస్తున్నది. దక్షిణాదిలో ఇది చెల్లదు. ఇప్పటి వరకు దక్షిణాది ప్రజలు మత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇక్కడ మతాన్ని మెదళ్లోకి ఎక్కించే పనిని బీజేపీ చేస్తోంది. కర్ణాటకలో అధికారంలో రావడానికి, తెలంగాణలో తమ బలం పెరగడానికి మతం బాగా దోహదం చేసింది. చిత్రమేమిటంటే అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో కూడా బీజేపీ ఓట్ల శాతం పెరగడం. మొన్నటి ఎన్నికల్లో త్రిసూర్‌ నుంచి నటుడు సురేశ్‌ గోపి కమలం గుర్తుపైనే గెలిచాడు. కొన్ని జిల్లాలలో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh), తమిళనాడు మాత్రం బీజేపీని దగ్గర రానివ్వడం లేదు. తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉన్నంత కాలం బీజేపీ రవ్వంత కూడా ఎదగదన్నది వాస్తవం.

ఇది ఏపీ బీజేపీ శాఖ ఒప్పుకోకపోయినా జరుగుతున్నది ఇదే! టీడీపీ చెప్పినట్టు నడవాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్ర బీజేపీలో తెలుగుదేశంపార్టీదే(TDP) ఆధిపత్యం. మొన్నటిమొన్న తిరుమల లడ్డూ వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబునాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తే, తెలుగుదేశంపార్టీ కంటే బీజేపీనే ఎక్కువ బాధపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కొంచెం కోపం కూడా వచ్చింది. చంద్రబాబును సుప్రీం అలా ఎలా అంటుంది? అంటూ నిలదీశారు కూడా! సుప్రీంకోర్టు వ్యాఖ్యలనే ఆమె తప్పుపట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఈ వంద రోజుల పాలనలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం మార్కు కూడా కనిపించలేదు. పైగా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటిని నెరవేర్చలేదు. ఆరు గ్యారంటీలు అలాగే ఉన్నాయి. మొన్న వచ్చిన వరదప్పుడు కూటమి సర్కారు పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు.

అప్పుడు కూడా ప్రతిపక్షంపైనే నిందలు వేశారు తప్పితే బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టలేదు. ప్రజలు ఎక్కడ తమను తిట్టిపోస్తారోనన్న భయంతో తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. తిరుమల లడ్డూ పేరు చెప్పగానే ప్రజలు భావోద్వేగాలకు గురి అవుతారని, ఆరు గ్యారంటీను మర్చిపోతారని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఆ ప్లాన్‌ ఎదురు తిరిగింది. కథ అడ్డం తిరిగింది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసేసరికి ఏపీ బీజేపీలో ఉన్న తెలుగుదేశంపార్టీ సానుభూతి పరులకు విపరీమైన కోపం వచ్చింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు చాలా తెలివిగా తన మనుషులను బీజేపీలోకి పంపించారు. వారే చంద్రబాబుకు వంత పాడుతున్నారు. ఒరిజినల్‌ బీజేపీ నాయకులు మాత్రం హైకమాండ్‌కు వాస్తవ పరిస్థితులు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. ఇలాగైతే మన పార్టీకి ఎదుగుబొదుగు ఉండదని వాపోయారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ సొంతంగా బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీ అనే మర్రిచెట్టు కింద మొక్కలాంటి బీజేపీ ఎదగడం కష్టమే. అందుకే ఇక్కడ కూడా బీజేపీ మతాన్ని రాజకీయాల్లో తెచ్చే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో ఉన్న తెలుగుదేశం బ్యాచ్‌తో ఇది కుదరని పని.

ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే వారికి పవన్‌ కల్యాణ్‌ గుర్తుకొచ్చారు. ఏపీలో పవన్‌ క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో ఉన్న 13 శాతం కాపు సామాజికవర్గానికి పవన్‌కు ఓ ఐకాన్‌. పవన్‌ ఆవేశపూరితమైన మాటలు, అవసరానికి తగినట్టుగా మారే వేషభాషలు బీజేపీని ఆకర్షించాయి. పైగా బీజేపీ అధినాయకత్వానికి పవన్‌ వీర విధేయుడు. బీజేపీకి ఇంకేం కావాలి? అందుకే పవన్‌ను(Pawan kalyan) అక్కున చేర్చుకుంటోంది. వచ్చే ఎన్నికలలోపే జనసేన పార్టీని తమలో విలీనం చేసుకుని, పవన్‌కు పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనతో బీజేపీ ఉంది. అగ్రనటుడు కావడం వల్ల తమిళనాడులో కూడా అంతో ఇంతో పవన్‌కు ఆదరణ ఉంటుంది. అందుకే కాబోలు ఈ మధ్య ఎంజీఆర్‌ జపం కూడా చేస్తున్నారు పవన్‌. తమిళనాడులో అన్నామలై ఎంతకష్టపడుతున్నా పార్టీ ఎదగడం లేదు.

అందుకే పవన్‌ను నమ్ముకుంటోంది బీజేపీ. ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ పెరగడమన్నది జరగని పని! వంద రోజుల పాలన ప్రజలలో అసంతృప్తిని పెంచిందనన్నది వాస్తవం. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలుగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనక్కూడా మరో దారి లేదు. అలాంటప్పుడు టీడీపీతోనే అంటకాగితే మొదటికే మోసం వస్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే జనసేనను నమ్ముకోవడం బెటరనే ఉద్దేశానికి వచ్చింది. తిరుమల లడ్డూకు ఎలాంటి అపచారం, అపరాధం జరగలేదని టీటీడీ ఈవో శ్యామలరావు మైకుల ముందు చెప్పినా పవన్‌ కల్యాణ్‌ మాతరం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కాషాయ దుస్తులు ధరించాడు. నుదుట నామాలు పెట్టుకున్నారు. ఈ వేషధారణ చూసి బీజేపీ మురిసిపోయింది.

పైగా ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మం నినాదం కమలదళ నేతలకు బాగా నచ్చింది. హిందూ మతానికి సనాతన ధర్మం అనే మాట పర్యాయపదంగా మారింది. ప్రాణం పోయినా సరే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని, హిందువులకు అన్యాయం జరుగుతోందని, హిందువులంతా ఇళ్లల్లోంచి బయటకు రావాలని పవన్‌ ఆవేశంగా అన్నారు. పనిలోపనిగా ఉదయనిధి స్టాలిన్‌పై విమర్శలు చేశారు. ఓ బీజేపీ నాయకుడిగా పవన్‌ మాట్లాడారు. సనాతన ధర్మం అంటూ పదే పదే పవన్‌ అంటుండటంతో అసలు సనాతనధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం కరడుగట్టిన బీజేపీ వాళ్లు చెబుతుంటారు కానీ వేదాలలో కూడా సనాతన ధర్మం అనే మాట లేదు. పైగా సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని పవన్‌ అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజ్యాంగ ధర్మం కంటే సనాతన ధర్మం భిన్నమైనది కాదు కదా! అన్యమతాలకు న్యాయస్థానాలు పెద్ద పీట వేస్తున్నాయని ఓ అసత్యపు ఆరోపణ కూడా చేశారు వపన్‌. మన దేశానికి ఓ రాజ్యంగం ఉందని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం న్యాయస్థానాల విధి అని పవన్‌కు తెలియదు కాబోలు. న్యాయస్థానాలకు మతం ఉంటుందా? మొత్తంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నెమ్మదిగా రంగు మారుస్తున్నారు. కాషాయాన్ని పులుముకుంటున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే పవన్‌ మాట్లాడిన మాటలన్నీ బీజేపీ మాటలే! బీజేపీనే ఇలా మాట్లాడగలుగుతుంది. బీజేపీ ప్లాన్‌ ఎంత వరకు వర్క్‌అవుటవుతుందో వేచి చూద్దాం.

రుగ్వేద కాలంలో వసుక్ర రుషి దేవేంద్రుడిని ఇలా ప్రార్థించాడట! ‘‘ఓ ఇంద్రుడా! నీ కొరకు రుత్వికులు వేగంగా మత్తెక్కించే సోమాన్ని సిద్ధం చేస్తున్నారు. నీవు సోమాన్ని తాగు తున్నావు. వారు నీ కొరకు వృషభాన్ని వండుతున్నారు. నీవు ఆహారాన్ని తింటున్నావు’’ – ఈ రుగ్వేద శ్లోకాన్ని మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఉటంకించారు. కనుక ఆచార వ్యవహారాలు, ఆహారపు అల వాట్లు వగైరా ధర్మాధర్మ విచికిత్సలన్నీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి.

ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతున్నది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనా తన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాము లున్నారు. శంకర పీఠాలతో సహా బోలెడన్ని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారీ, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థచింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ప్రజలారా... తస్మాత్‌ జాగ్రత్త!!

Eha Tv

Eha Tv

Next Story