ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాజకీయం రసకందాయంలో పడింది.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు(Yogi adityanath) అసమ్మతి బెడద పట్టుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి(BJP) అత్తెసరు మార్కులు రావడానికి కారణం యోగీనేనని ఆయనంటే పడనివాళ్లు ప్రచారం చేస్తున్నారు. యోగిని డిఫేమ్‌ చేస్తున్నది ఎవరో కాదు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్యనే(Kesav prasad mauryan)! ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి చాన్నాళ్లుగా పడటం లేదు. సందర్భం వచ్చిన ప్రతీసారి యోగి నాయకత్వాన్ని ఎత్తి చూపుతున్నారు. సమయం వచ్చిన ప్రతిసారి యోగి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గ్రాఫ్‌ పడిపోవడానికి కారణం యోగీనేనని ప్రచారం కూడా చేస్తున్నారు. యూపీలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి వుంది. ఆ ఎన్నికల ఫలితాలు అటో ఇటో అయితే యోగి వ్యతిరేకులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏడేళ్ల పాటు ఎదురులేకుండా పాలించిన యోగికి ఇప్పుడు మౌర్య రూపంలో కష్టాలు మొదలయ్యాయి. కేశవ్‌ ప్రసాద్ మౌర్య కూడా మామూలు వ్యక్తి కాదు.

ఉత్తరప్రదేశ్‌లో బాగా పేరున్న మనిషే! ఎనిమిదో దశకంలో అప్పటి అలహాబాద్‌లో (ఇప్పుడది ప్రయాగరాజ్‌గా మారింది) బుక్కల్‌ మహరాజ్‌ అనే పెద్ద డాన్‌ ఉండేవాడు. బుక్కల్ మహరాజ్‌ అసలు పేరు వశిష్ట నారాయణ్‌ కర్వారియా. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఈయన మాఫియా డాన్‌! ఇసుక మాఫియా కింగ్‌పిన్‌. బుక్కల్‌ మహరాజ్‌ పేరు చెబితే చాలు రాజకీయ నాయకులు కూడా గడగడమని వణికేవారు. మొన్నామధ్యన యోగీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేసి చంపేసిన అతీక్‌ అహ్మద్‌ గుర్తున్నాడు కదా! సాధారణవైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళుతున్నప్పుడు కొందరు అతడిపై, అతడి సోదరుడు అష్రఫ్‌పై కాల్పులు జరిపిన వైనం కూడా గుర్తుండే ఉంటుంది. ఈ అతీక్‌ అహ్మద్‌ అప్పట్లో బుక్కల్‌ మహరాజ్‌ దగ్గర గుండాగా పని చేసేవాడు. బుక్కల్‌ మహరాజ్‌తో ఎందుకైనా మంచిదని రాజకీయ నాయకులందరూ సఖ్యతగానే ఉండేవారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే జవహర్‌యాదవ్‌తో మాత్రం బుక్కల్ మహరాజ్‌ గొడవ పెట్టుకున్నాడు. అది కాస్తా ముదిరి పెద్దదయ్యింది. సరిగ్గా అదే సమయంలో అతీక్‌ అహ్మద్‌ కూడా బుక్కల్‌ మహరాజ్‌ను వదిలేసి సొంతంగా దుకాణం పెట్టుకున్నాడు.

శత్రుశేషం ఉండకూడదని 1991లో బుక్కల్ మహరాజ్‌ను అతీక్‌ అహ్మద్‌ చంపేశాడు. అతడి చట్టవ్యతిరేక కార్యకలాపాలను తమ గుప్పిట్లో తీసుకున్నాడు. అలా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. బుక్కల్‌ మహరాజ్‌ హత్య వెనుక జవహర్‌ యాదవ్‌ హస్తం కూడా ఉందంటారు కొందరు. ఇది ఇలా ఉంటే బుక్కల్‌ మహరాజ్‌ చనిపోయిన అయిదేళ్ల తర్వాత అలహాబాద్‌లో గగుర్పాటు కలిగించే సంఘటన జరిగింది. మారుతి కారులో వెళుతున్న జవహర్‌ యాదవ్‌ కారును ఓ వ్యాన్‌ ఓవర్‌టేక్‌ చేసింది. సినిమాల్లోలా కారుకు అడ్డంగా ఆగింది. దాంతో మారుతి కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. అంతలోనే వ్యానులోంచి దిగిన ఓ వ్యక్తి ఆటోమేటిక్‌ గన్‌ ఎక్కుపెట్టి జవహర్‌పై తుటాల వర్షం కురిపించాడు. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి పేరు ఉదయ్‌ భాన్‌ కర్వారియా. చనిపోయిన బుక్కల్ మహరాజ్‌ కుమారుడు.

అంతకంత ప్రతీకారం తీర్చుకున్న ఉదయ్‌ భాన్‌కు బీజేపీ అండదండలు బాగానే ఉన్నాయి. బారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2002, 2007లో పోటీ చేశాడు. రెండుసార్లు విజయం సాధించాడు. ఇతడు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో జవహర్‌ యాదవ్‌ హత్య కేసును పోలీసులు అసలు పట్టించుకోలేదు. దాని జోలికి కూడా వెళ్లలేదు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh yadav) ముఖ్యమంత్రి అయ్యాక హత్య కేసులో కదలిక వచ్చింది. 2019లో ఉదయ్‌ భాన్‌తో పాటు అతడి తమ్ముడు సూరజ్‌ భాన్‌ కర్వారియాకు కూడా జీవిత ఖైదు శిక్ష పడింది. అన్నదమ్ములిద్దరూ జైల్లో ఉన్నా తమ తండ్రి చావుకు కారణమైన అతీక్‌ అహ్మద్‌ను చంపడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అతీక్‌ను చంపి తీరతామని ప్రతినబూనారు. 2023లో తమ ప్రతిజ్ఞ చెల్లించుకున్నారు. ఏప్రిల్‌లో అతీక్‌ అహ్మద్‌ను చంపేశారు. జైల్లో ఉంటూనే ఉదయ్‌ భాన్‌ ప్లాన్‌ వేశాడని చెబుతుంటారు కానీ అది యోగీ ప్రభుత్వం తీసుకున్న చర్యేనని కొందరు వాదిస్తుంటారు. అసలు అతీక్‌ చావు వెనుక వీరిద్దరి ప్రమేయం లేదని, వేరే వాళ్లు చేసిన పని ఇదని మరికొందరు అంటుంటారు.

ఉదయ్‌భాన్‌కు డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఉదయ్‌ భాన్‌ జైలుకు వెళ్లిన తర్వాతే కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య రాజకీయంగా ఎదగడం మొదలుపెట్టారు. ఉదయ్‌భాన్‌ అంటే మౌర్యకు వణుకు! ఇప్పుడు ఉదయ్‌ భాన్‌ కర్వారియా జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతడికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ క్షమాభిక్ష పెట్టారు. ఎనిమిదేళ్ల తర్వాత ఉదయ్‌ భాన్‌ జైలు నుంచి బయటకు వస్తున్నాడు. జైలులో సత్ర్పవర్తనతో ఉన్నాడని, అందుకే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది కానీ విడుదల వెనుక అంతరార్థం, పరమార్థం వేరు! ఉదయ్‌ను బయటకు తెస్తున్నదే యోగి అని చెబుతుంటారు. యోగి పైకి కాషాయం కట్టి సన్యాసిలా ఉంటారు కానీ ఆయన రాజకీయాలు చాలా కఠినంగా ఉంటాయి. అసలు యోగి పాలనలో జరిగిన ఎన్‌కౌంటర్లు మరెప్పుడూ జరగలేదు. పేరుకు సంఘ విద్రోహుల ఏరివేతే కానీ, రాజకీయంగా తనకు అడ్డువచ్చే శక్తులన్నింటినీ నిర్మూలించుకుంటూ వెళుతున్నారు యోగి. అలాగే తనకు ఉపయోగపడే వారిని కూడా జైలు నుంచి బయటకు తీసుకొస్తున్నారు. అందులో ఉదయ్‌ భాన్‌ కూడా ఒకరు. ఉదయ్‌ భాన్‌ బయటకు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు మరింత వేడిగా మారతాయనడంలో సందేహం లేదు.

Updated On 30 July 2024 11:11 AM GMT
Eha Tv

Eha Tv

Next Story