లా ఏమి చెబుతుందంటే

అప్పు తీర్చకముందే కొంతమంది హటాత్తుగా మరణిస్తున్నారు కూడా.. కనుక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. అతని కుమారుడు లేదా పిల్లలు అతని రుణాన్ని తీర్చాలా? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి అప్పు తీర్చేందుకు ఎవరు బాధ్యులు? ఇలాంటి కేసుల్లో బ్యాంకు డబ్బును ఎలా తిరిగి పొందుతుందో మీకు తెలుసా? గతంలో సుప్రీంకోర్టు 2001లో ఒక తీర్పు ఇచ్చింది. K. రాజమౌళి vs AVKN స్వామి కేసులో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం గురించి పూర్తి సమాచారం ఈ రోజు తెలుసుకుందాం..
రుణగ్రహీత రుణం చెల్లించకుండానే మరణిస్తే, ఆ అప్పు భారం పిల్లలపై పడుతుందా?
కొన్ని సందర్భాల్లో మాత్రమే తండ్రి అప్పు తీసుకుని.. దానిని తీర్చకముందే మరణిస్తే.. తండ్రి తీసుకున్న అప్పుని కొడుకు తీర్చాల్సి రావచ్చు. అయితే అది పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
భారతీయ వారసత్వ చట్టం 1925: ఈ వారసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించే సమయానికి అతను తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోతే.. అటువంటి సందర్భంలో బ్యాంకులు కొడుకు ఆస్తి నుంచి రుణాన్ని తిరిగి పొందుతాయి. అదనంగా.. CPC సెక్షన్ 50 ప్రకారం వారసుడు తన తండ్రి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అయితే తండ్రి నుండి ఆస్తిని వారసత్వంగా కొడుకు పొందినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. వారసుడు అంటే కొడుక్కి.. మరణించిన తండ్రి నుంచి లేదా అతని పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందకపోతే.. అటువంటి సందర్భంలో ఆ అప్పు భారం కొడుకుపై పడదు. తండ్రి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించమని కొడుకుని బ్యాంకులు బలవంతం చేయలేవు.
ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారం.. ఏదైనా అప్పుకు చట్టపరమైన బాధ్యత ఒప్పందంలోకి ప్రవేశించిన వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. అంటే తండ్రి తీసుకున్న రుణానికి కొడుకు ఏ విధంగానూ హామీదారుగా ఉండక పోతే.. తండ్రి తీసుకున్న అప్పుకి వ్యక్తిగతంగా కొడుకు బాధ్యత వహించడు. కొడుకు దేనికైనా హామీదారుగా ఉంటే.. అప్పుడు తండ్రి తీసుకున్న అప్పుని పూర్తిగా తీర్చాల్సిన బాధ్యత కొడుకుపై పడుతుంది.
అంతేకాదు సుప్రీంకోర్టు కె. రాజమౌళి vs AVKN స్వామి (2001) 5 SCC 37 కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం వారసుడు ఏదైనా ఆస్తిని వారసత్వంగా పొందకపోతే.. అప్పుడు కొడుకు తండ్రి అప్పుకు బాధ్యత వహించడని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి ఉమ్మడి కుటుంబానికి చెందినది అయితే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం సామాజిక లేదా కుటుంబ ప్రయోజనాల కోసం అయితే.. అటువంటి సందర్భాలలో వారసులు తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తి నుంచి రుణాన్ని తిరిగి చెల్లించాలి.
సంక్షిప్తంగా తండ్రి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి కొడుకు వ్యక్తిగతంగా బాధ్యత వహించడు. అయితే తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తి ఉంటే మాత్రమే తండ్రి అప్పుకి కొడుకు బాధ్యత వహిస్తాడు. వారసత్వంగా ఏ ఆస్తి లేకపోతే.. అప్పుడు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కొడుక్కి ఉండదు.
