సిద్ధరామయ్య సోషలిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ప్రభావం ఆయన మీద ఉంది. 1978లో మైసూరు జిల్లా కోర్టులో సిద్ధరామయ్యకు నంజుండస్వామి పరిచయమయ్యారు. ఆయనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా నంజుండస్వామి కోరారు. 1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన జనతా పార్టీలో చేరారు. అధికార భాషగా కన్నడను ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవలు సమితికి అధ్యక్షునిగా పనిచేశారు.

పశువుల కాపరి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. కర్నాటక రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయనది. రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగిన నేత మాత్రమే కాదు. ఒక సైద్ధాంతిక స్పష్టత ఉన్న వ్యక్తి. సోషలిస్టు భావజాలంతో పెరిగిన ఆయన లౌకిక ప్రమాణాలు మచ్చలేనివి. మైనార్టీలు, దళితులు, ఓబీసీల సామాజిక కూటమిని ఏర్పాటు చేసి, వారి విశ్వాసాన్ని పొందిన ఏకైక నాయకుడు సిద్ధరామయ్య. ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని ఐదేళ్లపాటు సమర్దంగా నడిపిన విలక్షణ నాయకుడు సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానంపై ఈహా స్పెషల్ స్టోరీ..

కుటుంబ నేపథ్యం :-

కర్నాటకలోని మూడో అతి పెద్ద సామాజిక వర్గం కురుబ కులానికి చెందిన సిద్ధరామయ్య.. 1948 ఆగస్టు 12న మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. పదేళ్ళ వయసు వచ్చే వరకు ఆయన బడికి పోలేదని చెబుతారు. పొలం పనుల్లో తండ్రికి సాయం చేస్తూ పశువులు కాసేవారంట. ఆ తరువాత ఆయన డిగ్రీ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కర్ణాటకలో కురబల జనాభా సుమారు 9 శాతం. బీసీల్లో మంచి పట్టున్న నేతగా సిద్ధరామయ్యను చూస్తారు. అణగారిన, అట్టడుగు వర్గాలతో అనుబంధం, కనెక్టివిటీ ఉన్న గొప్ప మాస్​ లీడర్​‎గా ఆయనకు పేరుంది.

రామ్ మనోహర్ లోహియా ప్రభావం :-

సిద్ధరామయ్య సోషలిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ప్రభావం ఆయన మీద ఉంది. 1978లో మైసూరు జిల్లా కోర్టులో సిద్ధరామయ్యకు నంజుండస్వామి పరిచయమయ్యారు. ఆయనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా నంజుండస్వామి కోరారు. 1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన జనతా పార్టీలో చేరారు. అధికార భాషగా కన్నడను ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవలు సమితికి అధ్యక్షునిగా పనిచేశారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మరొకసారి గెలిచిన సిద్ధరామయ్య, రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రి పదవి చేపట్టారు. 1994లో హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జనతాదళ్‌ అధికారంలోకి వచ్చింది. నాడు సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. 1996లో జయదేవప్ప హలప్ప పటేల్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు సిద్ధరామయ్యను డిప్యూటీ సీఎంగా నియమించారు.

కాంగ్రెస్‌లో చేరిక..ముఖ్యమంత్రి పదవి :-

దేవేగౌడ నాయకత్వంలోని ఒక వర్గం జనతా పార్టీ నుంచి విడిపోయి జనతా దళ్(సెక్యులర్) పేరుతో ఒక పార్టీని స్థాపించింది.నాడు సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. 2004లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉపముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. జేడీ(ఎస్) పార్టీలో దేవెగౌడ, సిద్ధరామయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. జేడీ(ఎస్)లో సిద్ధరామయ్య నెంబర్‌ టూ నేతగా ఉండేవారు. కొడుకు కుమార స్వామి కోసం సిద్ధరామయ్యను దేవెగౌడ పక్కన పెట్టారనే విమర్శ ఉంది. ఈ విభేదాల నేపథ్యంలో చివరకు జేడీ(ఎస్) నుంచి సిద్ధరామయ్యను 2005లో బహిష్కరించారు. దాంతో ఆయన కాంగ్రెసులో చేరిపోయారు. 2006లో జరిగిన ఉపఎన్నికలో సిద్ధరామయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు నడిపిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం..పరిపాలన దక్షత :-

పశువుల కాపరి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. కర్నాటక రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయనది. ఆర్ఎస్​ఎస్, బీజేపీ హిందూత్వ భావజాలాన్ని బలంగా ఎదుర్కొన్న ఓబీసీ నేత సిద్ధరామయ్య. మైనార్టీలు, దళితులు, ఓబీసీల సామాజిక కూటమిని ఏర్పాటు చేసి, వారి విశ్వాసాన్ని పొందిన ఏకైక నాయకుడు సిద్ధరామయ్య. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తేనే వారి ఆకాంక్షలు నెరవేరుతాయన్నది కర్నాటకలోని మెజారిటీ ప్రజల నోట వినిపిస్తున్న మాట. అన్న భాగ్య, క్షీర భాగ్య వంటి వినూత్న కార్యక్రమాలతో సంక్షేమ రంగంలో ఆయన విశేషమైన కృషి చేశారు. అభివృద్ధి, పరిపాలనలో ఆయన సమర్థతపై ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాలను అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీని , ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో సిద్ధిరామయ్య సిద్ధహస్తులు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధి రామయ్య ఇప్పటివరకు 13 సార్లు బడ్జెట్‎ను ప్రవేశపెట్టి రికార్డ్‎ను సొంతం చేసుకున్నారు.2013లో కాంగ్రెస్ కు 122 స్థానాలను అందించడంలో సిద్ధ రామయ్య కీలకపాత్ర పోషించారు.అదే నమ్మకంతో ఆయనకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది.

సైద్ధాంతిక స్పష్టత :-

2017లో బెంగుళూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌‌పై మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సులో సిద్ధరామయ్య ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వేదికపై సిద్ధరామయ్య ప్రసంగిస్తూ.. అనేక దురాచారాలకు మూలకారణం కులం.. కాబట్టి అంబేద్కరిజమే దానికి సరైన విరుగుడు అని అన్నారు. ఇలాంటి ప్రకటన చేయడం నిస్సందేహంగా సిద్ధరామయ్య వంటి బహుజన నాయకులకు మాత్రమే సాధ్యం. సరైన ప్రణాళిక, ఏర్పాట్లను బట్టి ఆయన ఎంతటి సమర్థుడైన నిర్వాహకుడో ఆ కార్యక్రమం చాటిచెప్పింది. అమెరికన్ మానవ హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పెద్ద కొడుకు మార్టిన్ లూథర్ కింగ్ 3 ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడంలో సిద్ధరామయ్య ముద్ర బాగా కనిపించింది. ఆ సదస్సుకు వచ్చిన అతిథులతో సిద్ధరామయ్య వ్యవహరించిన విధానం ఆకట్టుకుంది.ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలపై ఆయన డెలిగేట్స్‎తో జరిపిన అర్థవంతమైన సంభాషణలను చూసి వారు ఎంతో మెచ్చుకున్నారు. హిందూత్వ శక్తులు సృష్టించుకున్న నేటి రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఇలాంటి భావన ఉంటుంది? సిద్ధరామయ్య కేవలం స్వయం కృషితో ఎదిగిన నాయకుడు మాత్రమే కాదు..ఒక సైద్ధాంతిక స్పష్టత ఉన్న నాయకుడు సిద్ధరామయ్య. ఈ లక్షణం కలిగిన నాయకులు ఈ రోజుల్లో చాలా అరుదనే చెప్పాలి.

సీఎంగా సిద్ధరామయ్యకే జనం జై :-

నిజానికి కర్నాటకలో 40 శాతం మంది ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా భావించే కాంగ్రెస్​‎కు ఓటు వేసినట్లు ఓపీనియన్​ సర్వేల్లో తేలింది. ‘సోషల్​విజన్’, ‘మాస్ బేస్’ కలగిన నేత కావడమే కాదు. శూద్రుల విషయంలో గొప్ప ఆలోచనాపరుడు, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్‌‌కు రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయన్నది ప్రచారం మాత్రమే కాదు..అది అక్షరం సత్యం కూడ. కర్నాటకలో మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్రలో ఆయన ప్రభావం చూపగలరు. ఆయన సామాజిక వర్గం కురుబలు తెలంగాణలో, మహారాష్ట్రలో ధన్‌‌గర్లుగా పిలుస్తున్న వారితో రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో 6 శాతం జనాభాతో తెలంగాణలోని కురుబలు ఎన్నికలపరంగా ముఖ్యమైనవారే. మహారాష్ట్రలోని ధన్​గర్లు 9 శాతం జనాభాతో మూడవ అతిపెద్ద సమూహం. సాంస్కృతికంగా, భౌగోళికంగా అనుబంధంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలను పూర్తిగా ఆకర్షించడంతో పాటు, ఈ రెండు రాష్ట్రాల్లోని బీసీలను కదిలించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యవైపే మొగ్గుచూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated On 17 May 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story