ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్(Hathras) జిల్లా సికింద్రా రావు పట్టణానికి దగ్గరలో జరిగిన సత్సంగ్‌ను ఎవరు నిర్వహించినట్టు?
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్(Hathras) జిల్లా సికింద్రా రావు పట్టణానికి దగ్గరలో జరిగిన సత్సంగ్‌ను ఎవరు నిర్వహించినట్టు? అంతమంది ప్రాణాలు పోవడానికి కారకులెవరు? తొక్కిసలాట(stampede) జరుగుతుందని అనుకోలేదా? అసలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అని భోలే బాబా(Bhole baba) చరిత్ర ఏమిటి? ఈ సందేహాలను తెలుసుకుంటే సంభ్రమాశ్చర్యాలకు లోనుకావడం గ్యారంటీ! నారాయణ్ సాకార్ హరి పేరుతో సత్సంగ్ జరిగింది. హాథ్రాస్‌లో ఎక్కడ చూసినా ఇతడి పోస్టర్లే కనిపించాయి. ఈ నారాయణ్ సాకారే భోలే బాబా! ఇతడికి విశ్వహరి అనే మరో పేరు కూడా ఉంది. జులై మాసంలో వచ్చే తొలి మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమ్ సమితి పేరుతో నిర్వహించారు. ఈ సమితిలో నిర్వాహకులుగా ఉన్న ఆరుగురి మొబైల్ ఫోన్లు ప్రస్తుత స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. అందుకే స్థానిక పోలీసులు వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు.
భోలే బాబా అసలు పేరు సూరజ్‌పాల్ జాతవ్(Surajpal Jathav). పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాడు. సూరజ్‌పాల్ జాతవ్ అలియాస్ భోలే బాబా జీవితం బాలీవుడ్ సినిమా కథలాగే ఉంటుంది. ఎటా జిల్లా నుంచి విడిపోయిన కాస్‌గంజ్ జిల్లాలో పటియాలి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చెందిన బహదూర్‌పూర్ గ్రామంలో నారాయణ్ సాకార్ హరి ఉండేవాడు. యూపీ పోలీస్ విభాగంలో మొదట లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో పని చేశాడు. అతడిపై అనేక ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట సస్పెండ్ అయ్యారు. తర్వాత అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు. అంతకుముందు సూరజ్‌పాల్ పలు పోలీసు స్టేషన్లలో, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లలో పనిచేశారు. వేధింపుల కేసులో సూరజ్‌పాల్ ఎటా జైలులో కొన్నాళ్లు ఉన్నాడు. తనను అకారణంగా సర్వీస్‌లోంచి డిస్మిస్ చేశారంటూ కోర్టుకు వెళ్లి మళ్లీ ఉద్యోగం సంపాదించాడు సూరజ్‌పాల్. 2002లో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. తర్వాత తన స్వగ్రామం నాగ్లా బహదూర్‌పూర్‌కు వెళ్లి కొన్ని రోజులు గడిపాడు. దేవుడితో డైరెక్ట్‌గా మాట్లాడతానని, తనకు శక్తులు ఉన్నాయని ఊరి ప్రజలకు నమ్మించాడు. తనకు తాను భోలే బాబాగా ప్రచారం చేసుకున్నాడు. అచిరకాలంలోనే ఆయనకు పెద్దపెట్టున అనుచరులు ఏర్పడ్డారు. సూరజ్‌పాల్ (భోలే బాబా) నిర్వహించే ఆధ్యాత్మిక (?)కార్యక్రమాలకు జనం వేలల్లో రావడం మొదలయ్యింది. సూరజ్‌పాల్‌కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. రెండో తమ్ముడు చనిపోయాడు. మూడోవాడు గ్రామ పంచాయతి సర్పంచ్‌గా పని చేసేవాడు. భోలే బాబా ఎప్పుడో కానీ ఊరికి వెళ్లేవాడు కాదు. కాకపోతే తన చారిటబుల్ ట్రస్ట్ మాత్రం ఇప్పటికీ అక్కడ ఉంది. భోలే బాబా ఎవరికి దగ్గర ఎలాంటి విరాళాలు తీసుకోలేదు. భక్తుల నుంచి కానుకలు కూడా తీసుకోలేదు. కానీ చాలా ఆశ్రమాలను ఆయన నిర్మించాడు. వాటికి డబ్బు ఎలా సమకూరిందన్నది సస్పెన్స్‌గానే ఉంది. మరింత పాపులర్ కావడం కోసం భోలే బాబా ఈ టెక్నిక్‌ను పాటించాడేమో! ఎప్పుడూ తెల్లటి బట్టలనే ధరించే భోలే బాబా తరచూ సూట్‌లు కూడా వేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఉన్నాడు కానీ ఫాలోవర్స్ ఎక్కువగా లేరు. క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మంది భక్తులు ఉన్నారు. భోలే బాబా కార్యక్రమాలకు పని చేయడానికి వందల మంది వలంటీర్లు తరలివస్తారు. వచ్చిన భక్తులకు నీళ్లు, ఆహారం అందించడమే కాదు, భక్తుల రద్దీని కూడా కంట్రోల్ చేస్తారు. మూడేళ్ల కిందట నెల రోజుల పాటు ఇటావా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. అప్పుడు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, ఇక ముందు భోలే బాబా ప్రోగ్రామ్‌కు అనుమతి ఇవ్వకూడదని అధికారులను స్థానికులు కోరారని యూపీ పోలీసు సర్వీసులో సర్కిల్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన రామ్‌నాథ్ సింగ్ యాదవ్ చెప్పారు.