రీసెంట్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) నోటి నుంచి డిజిటల్ అరెస్ట్(digital arrest) అనే పదం వచ్చింది.
రీసెంట్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) నోటి నుంచి డిజిటల్ అరెస్ట్(digital arrest) అనే పదం వచ్చింది. డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలపై ఆయన సవివరంగా చెప్పారు. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? అంటే అదో సరికొత్త సైబర్ నేరం(Cyber crime).. సైబర్ నేరగాళ్లు కొత్తగా డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ప్రజలను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India), సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), కస్టమ్స్, పోలీసు అధికారులమని చెబుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి క్రైమ్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, పోలీసు అధికారులమంటూ స్కైప్, జూమ్ ద్వారా అమాయకులకు వీడియో కాల్ చేస్తారు. పొరపాటున లిఫ్ట్ చేశారే అనుకోండి. ఇక ఆడుకోవడం మొదలు పెడతారు. తీవ్రమైన నేరాలలో ఇరుక్కున్నారని, టాక్స్‌లను ఎగ్గొట్టారని, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని .. ఇలా చాలా చాలా చెప్పి భయపెడతారు. మనీ లాండరింగ్, స్మగ్లింగ్, డ్రగ్స్ కేసులలో మీ పేరు ఉందని కూడా అంటారు. కోర్టు ఆదేశాలతో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తారు. విచారణ పేరుతో హడలేత్తిస్తారు. ఎదుటివారు నమ్మేట్టుగా ఉండేందుకు చక్కటి యూనిఫామ్ వేసుకుని కనిపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సంబంధిత శాఖల లోగోలు ఉంటాయి. విచారణ రహస్యంగా జరగాలని, ఎవరికైనా చెబితే కఠినమైన శిక్షలు ఉంటాయని దడుచుకునేలా చేస్తారు. విచారణలో భాగంగా మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. భయం కొద్దీ వారు అడిగిన డిటైల్స్ అన్ని ఇచ్చేస్తుంటాము.
ఇకపై తెలియని వారి నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులెవ్వరూ వీడియో కాల్ చేసి విచారణ చేయరు. సైబర్ కేటుగాళ్లు ఏది చెబితే అది చేయకూడదు. కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. వారు ఎంతగా తొందరపెట్టినా పట్టించుకోకండి. నింపాదిగా ఉండండి. నో యువర్ కస్టమర్ డాటా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలి వ్యక్తులకు చెప్పకూడదు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకూడదు.